బీసీలకు 50 సీట్లు ఇయ్యాల్సిందే!

బీసీలకు 50 సీట్లు ఇయ్యాల్సిందే!

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ పార్టీలో టికెట్ల లొల్లి మరో టర్న్ తీసుకుంటున్నది. ఎక్కువ స్థానాలను ఇవ్వాల్సిందేనని బీసీ నేతలు తేల్చి చెప్తున్నారు. సర్వేలు.. గిర్వేలు చూసి కాకుండా.. బలమైన స్థానాల్లో బీసీలకు టికెట్లివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. రాహుల్ చెప్పినట్టు 34 సీట్లు సరిపోవని భీష్మిస్తున్నారు. 50 సీట్లు ఇవ్వాల్సిందేనంటున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రెండు స్థానాలను బీసీలకు ఇవ్వాలని గతంలో చెప్పారు. ఆ దిశగానే పార్టీ రాష్ట్ర నాయకత్వం కసరత్తులు చేస్తున్నది. ఈ క్రమంలోనే శనివారం పార్టీకి చెందిన టీమ్ ఓబీసీ నేతలు గాంధీభవన్​లో సమావేశమయ్యారు. 

ఏఐసీసీ నేషనల్ కో ఆర్డినేటర్ కత్తి వెంకటస్వామి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి మహేశ్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, అంజన్ కుమార్ యాదవ్, ఈరవర్తి అనిల్, పీసీసీ ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్​గౌడ్, చెరుకు సుధాకర్ సహా 60 మంది బీసీ ఆశావహులు హాజరయ్యారు. పార్టీలో బీసీలకు సరైన ప్రాతినిధ్యం, ప్రాధాన్యం ఇవ్వడం లేదని నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలిసింది.

కమిటీల్లోనూ చోటియ్యట్లే..

ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ, స్క్రీనింగ్ సహా పలు కీలక కమిటీలను నియమించిన సంగతి తెలిసిందే. ఆ కమిటీలపై పలువురు నేతలు అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. బీసీలకు ఆయా కమిటీల్లో తక్కువ ప్రాధాన్యం కల్పించడంపై సమావేశంలో నేతలు చర్చించినట్టు సమాచారం. స్క్రీనింగ్ కమిటీలో కనీసం ఒక్క బీసీకైనా చోటు కల్పించాల్సిందని అన్నట్టు తెలిసింది. కమిటీల్లోనూ చోటు ఇయ్యట్లేదని, కనీసం టికెట్లైనా ఇవ్వాలని వారు తేల్చి చెప్పినట్టు సమాచారం. బీసీ నేతలను హైకమాండ్​ఢిల్లీకి పిలిపించి చర్చించాల్సిన అవసరం ఉందన్నట్టు తెలిసింది. జనాభాకు తగ్గట్టు బీసీలకు టికెట్లు కేటాయించాలన్న ఉదయ్​పూర్, రాయ్​పూర్ డిక్లరేషన్లను తప్పనిసరిగా పాటించాలని తీర్మానించినట్టు సమాచారం. రాహుల్ చెప్పినట్టు ఒక్కో పార్లమెంట్ సెగ్మెంట్​లో రెండు చొప్పున సీట్లు కాకుండా.. మూడు ఇవ్వాలని, అందుకు పోరాడేందుకు సిద్ధమని నేతలు చెప్పినట్టు తెలిసింది.

ఎన్నికల కమిటీలో మరిన్ని స్థానాలివ్వాలి

ఇటీవల నియమించిన ఎన్నికల కమిటీలో బీసీల ప్రాతినిధ్యాన్ని 5 నుంచి 15కు పెంచాలని సమావేశంలో బీసీ నేతలు తీర్మానించారు. స్క్రీనింగ్​ కమిటీలో మధు యాష్కీ, మహేశ్​కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, పొన్నాల లక్ష్మయ్య లేదా పొన్నం ప్రభాకర్​లలో కనీసం ఒకరికి చోటు కల్పించాల్సిందిగా ప్రతిపాదించారు. బీసీలకు పట్టున్న స్థానాలను గుర్తించి.. అక్కడ వారికి సీట్లివ్వాలని, వారిని గెలిపించేందుకు పార్టీ సీనియర్లు, పెద్దలు ప్రచారం చేయాలని తీర్మానించారు. ఆర్థిక బలం లేదని టికెట్​ తిరస్కరించొద్దని పేర్కొన్నట్టు తెలిసింది.

65 మంది పోటీకి సిద్ధం

పార్టీలో బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కత్తి వెంకటస్వామి కోరారు. పార్టీలో బీసీలకు తగిన ప్రాధాన్యం దక్కకపోతుండడంతో వారు బీఆర్ఎస్​, బీజేపీలవైపు చూస్తున్నారని అన్నారు. మీటింగ్ తర్వాత ఆయన గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. బీసీలకు ఎక్కువ సీట్లిస్తేనే బీసీల ఓట్లు పడతాయన్నారు. పోటీ చేయడానికి 65 మంది బీసీ ఆశావహులు సిద్ధంగా ఉన్నారని, బీసీలు బలంగా ఉన్న 48 సెగ్మెంట్లను గుర్తించామని చెప్పారు. చాలా మంది ఆర్థికంగా కూడా బలంగా ఉన్నారని చెప్పారు. తమ సమావేశం వివరాలను మాణిక్ రావు ఠాక్రే, రేవంత్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్తామన్నారు. :  - కత్తి వెంకటస్వామి.