ధోనీ ఉంటడా? ఉండడా?

ధోనీ ఉంటడా? ఉండడా?
  • విండీస్​టూర్​కు జట్టు ఎంపిక వాయిదా
  • శని, ఆది వారాల్లో జరిగే చాన్స్​
  • ఇండియాకు వచ్చిన విరాట్​

కరీబియన్​ టూర్​కు జట్టులో ఎవరెవరు ఉంటారు? టీమ్​ఎంపిక తర్వాత ధోనీ రిటైర్మెంట్​పై సెలెక్టర్లు ఏమైనా క్లారిటీ ఇస్తారా? కెప్టెన్​, వైస్​కెప్టెన్​మధ్య విభేదాలు ఉన్నాయని వార్తల నేపథ్యంలో లిమిటెడ్​ ఓవర్స్ సారథ్యం రోహిత్​కు అప్పగించే సాహసం చేస్తారా? ​టీ20 వరల్డ్​కప్​ దృష్ట్యా కుర్రాళ్లకు అవకాశం కల్పిస్తారా? ప్రస్తుతం టీమిండియా సగటు అభిమానిని వేధిస్తున్న ఈ ప్రశ్నలకు శుక్రవారం సమాధానం లభిస్తుందని ఆశించినా.. సెలెక్షన్​ కమిటీ సమావేశం వాయిదా పడటంతో ఈ ఉత్కంఠ మరింత పెరిగింది..! ఏదేమైనా ధోనీ ఫ్యూచర్​ను లక్ష్యంగా చేసుకుని సింగిల్​పాయింట్​అజెండాగా జరిగే సెలెక్టర్ల సమావేశం ఈ అంశానికి ఎలాంటి ముగింపు ఇస్తుందో చూడాలి..!

ముంబై: వరల్డ్​కప్​ నిష్క్రమణ తర్వాత.. అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న అంశం ధోనీ రిటైర్మెంట్. అతన్ని కొనసాగిస్తారా ? లేక పక్కనబెడతారా? ఒకవేళ తీసుకుంటే టీమ్​లో మహీ పాత్ర ఎలా ఉండబోతుంది? అనే అంశాలతో ముడిపడి ఉన్న కరీబియన్​ టూర్​కు జట్టు ఎంపిక సెలెక్టర్లకు తలనొప్పిగా మారింది. వాస్తవానికి శుక్రవారమే టీమ్​ను ప్రకటించాల్సి ఉన్నా సీఓఏ ఇచ్చిన కొత్త ఆదేశాల వల్ల దీనిని వాయిదా వేశారు. ఈ కొత్త రూల్​కు  సంబంధించిన లీగల్​ పేపర్​వర్క్​జరగాల్సి ఉండటంతో టీమ్​ఎంపిక శని లేదా ఆదివారాల్లో జరిగే అవకాశముంది. కెప్టెన్​ విరాట్​గురువారం సాయంత్రం భార్య అనుష్కతో కలిసి ఇండియాకు చేరుకున్నాడు. కాబట్టి సమావేశానికి అతను ప్రత్యక్షంగా హాజరుకానున్నాడు. దీంతో అందరితో సుదీర్ఘంగా చర్చించి టీమిండియాను ఎంపిక చేయాలని సెలెక్షన్​ కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ధోనీ కెరీర్​కు సంబంధించి కూడా ఓ స్పష్టత ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.  ఓవైపు మాజీలు కూడా వీడ్కోలు విషయంపై మహీతో మాట్లాడాలని డిమాండ్​చేస్తున్న నేపథ్యంలో చీఫ్​ సెలెక్టర్​ ఎమ్మెస్కే ఎలా వ్యవహరిస్తాడో చూడాలి. ధోనీని ఎంపిక చేసినా.. ఉద్వాసన పలికినా.. టీమిండియా ఫ్యూచర్​కోసం తీసుకోబోయే కఠిన నిర్ణయాలు ఇక్కడి నుంచే మొదలుకానున్నాయి. టీ20 వరల్డ్​కప్​దృష్ట్యా వికెట్​కీపర్​గా రిషబ్​ పంత్​కే ఎక్కువ అవకాశాలున్నాయి.  గతేడాది అక్టోబర్​లో విండీస్​తో జరిగిన టీ20 సిరీస్​కు మహీని విశ్రాంతి పేరుతో తప్పించారు. ఇప్పడు కూడా అదే విధంగా జరిగే అవకాశాలున్నాయి. కరీబియన్​ టూర్​ తర్వాత స్వదేశంలో బిజీ షెడ్యూల్​ ఆడాల్సి ఉంటుంది. కాబట్టి ధోనీ లేకపోయినా పెద్దగా ఇబ్బంది ఉండదనే అనుకుంటున్నారు.

కోహ్లీ వెళ్తాడా?

విండీస్​టూర్​కు అందుబాటులో ఉంటానని కోహ్లీ ఇప్పటికే ప్రకటించినా.. స్వదేశంలో బిజీ షెడ్యూల్​కారణంగా అతనికి విశ్రాంతినిచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రతిష్టాత్మక టెస్ట్​ చాంపియన్​షిప్​ కూడా మొదలుకానుండటంతో.. విండీస్​తో లిమిటెడ్​ఓవర్ల సిరీస్​కు రోహిత్​ను కెప్టెన్​గా ఎంపిక చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇక ఇద్దరు కెప్టెన్ల ఫార్ములాపై కూడా కసరత్తులు చేస్తుండటం కూడా ఇది ఓ కారణం కావొచ్చు. టెస్ట్​ల వరకు విరాట్​ జట్టుతో చేరొచ్చు. బుమ్రాకు కూడా ఇదే వర్తించనుంది.

బలమైన ‘మిడిల్’ ​కోసం

ఈ సమావేశంలో మరింత ఎక్కువ చర్చ మిడిలార్డర్​పై జరుగనుంది. ఇప్పటివరకు మిడిలార్డర్​కోసం చాలా మందిని పరీక్షించినా ఒక్కరు కూడా కుదురుకోలేదు. ఇప్పుడు రాయుడు, విజయ్​ శంకర్​ కూడా లేకపోవడంతో మనీష్​ పాండే, మయాంక్​ అగర్వాల్​, శ్రేయస్​ అయ్యర్​, శుభ్​మన్​ గిల్​, పృథ్వీ షాలాంటి కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నారు. ఇండియా–ఎ తరఫున విండీస్​లో గిల్​, మనీష్​దుమ్మురేపుతున్నారు. వరల్డ్​కప్​లో విఫలమైన దినేశ్​కార్తీక్​, కేదార్​ జాదవ్​కెరీర్​కు ముగింపు పడ్డట్లే. ధవన్​ గాయం నుంచి కోలుకుంటే తిరిగి జట్టులోకి వస్తాడు. లేదంటే రాహుల్​ను కొనసాగించే అవకాశం ఉంది. పాండ్యా, కుల్దీప్, చహల్​ అటోమెటిక్​గా ఎంపికకానున్నారు. టీనేజ్ లెగ్​స్పిన్నర్​​ రాహుల్​చహర్​గురించి చర్చ జరిగే అవకాశం ఉంది. పేస్​బౌలింగ్​లో షమీ, భువనేశ్వర్​తో పాటు కొత్త ముఖాలు నవ్​దీప్​సైనీ, ఖలీల్​ అహ్మద్​, దీపక్​చహర్​, ఆవేశ్​ఖాన్​ను పరీక్షించొచ్చు. టెస్ట్​లకు వచ్చేసరికి ఈ కూర్పు కొద్దిగా మారొచ్చు. టెస్ట్​వికెట్​కీపర్లుగా పంత్​, సాహా మధ్య గట్టి పోటీ నెలకొని ఉంది. ఓవరాల్​గా కొత్త, పాత కలయికతో టీమ్​ను ఎంపిక చేసి భవిష్యత్​కు భరోసా ఇస్తారా? లేక పాత వాళ్లతోనే మమ అనిపిస్తారా? చూడాలి.