బీహార్‌లో బీజేపీ ముఖ్య నేత మృతి

బీహార్‌లో బీజేపీ ముఖ్య నేత మృతి

బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, రాజ్యసభ మాజీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ (72) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన చికిత్స పొందుతూ న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో సోమవారం రాత్రి 9.45 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈ విష‌యాన్ని పార్టీ రాష్ట్ర యూనిట్ వెల్లడించింది. తనకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింద‌ని, ఈసారి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన‌లేనని సుశీల్ కుమార్ మోదీ గత నెలలో ప్రకటించారు. ఆ ప్రకటన వచ్చి రోజులు గడవక ముందే సుశీల్ కుమార్ మోదీ మరణించడం ఆ పార్టీని కలచివేస్తోంది.

సుశీల్ కుమార్ మోదీ బీహార్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 2005 నుంచి 2013 వరకూ బిహార్ ఉప ముఖ్యమంత్రిగానూ.. 2017 నుంచి 2020 వరకూ బిహార్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. అలాగే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సభ్యుడు కూడా పని చేశారు. సుశీల్ కుమార్ మోదీ మరణంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. సుశీల్ కుమార్ మోదీ తన జీవితాన్ని బీహార్‌కు అంకితం చేశారన్నారు. బిహార్‌ను జంగిల్ రాజ్ నుంచి బయటకు తీసుకొచ్చి అభివృద్ధి పథంలో నడిపించడంలో సుశీల్‌ మోదీ కృషి ఎంతో ఉపయోగపడిందని ట్విటర్‌లో పేర్కొన్నారు.