పోటీ వద్దనుకొని గోల్డ్ మెడల్‌ పంచుకున్నరు

పోటీ వద్దనుకొని గోల్డ్ మెడల్‌ పంచుకున్నరు

టోక్యో: స్నేహం కోసం ఏమైనా చేసే ఫ్రెండ్స్‌ను చూశాం. మిత్రుడి కోసం దేన్ని వదులుకోవడానికైనా కొందరు రెడీ అవుతారు. ఫ్రెండ్‌షిప్ అంటే షేర్ చేసుకోవడమేనని ఇంకొందరు నమ్ముతారు. దీనికి ఆటగాళ్లు కూడా మినహాయింపు కాదేమో.. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న హైజంపర్లు ముతాజ్ ఎస్సా బార్షిమ్ (ఖతార్), గియాన్‌మార్కో తాంబెరీ (ఇటలీ)ల కథ తెలుసుకుంటే ఫ్రెండ్‌షిప్ విలువేంటో అర్థం అవుతుంది. బార్షిమ్, తాంబెరీ వేర్వేరు దేశాల ఆటగాళ్లు అయినప్పటికీ వీరి మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. అయితే మెడల్‌ను పంచుకునేంత స్నేహం ఉందని.. అది కూడా మిత్రుడితో పోరాడకుండా గోల్డ్ మెడల్‌ను షేర్ చేసుకుంటారని మాత్రం ఎవరూ ఊహించి ఉండరు. 

టోక్యో ఒలింపిక్స్‌లో ఆదివారం హైజంప్ పోటీలు జరిగాయి. ఈ గేమ్‌లో తాంబెరీ, బార్షిమ్ మిగిలిన ఆటగాళ్లను తోసి మెడల్ రేసులో నిలిచారు. వీరి మధ్య గోల్డ్ మెడల్ కోసం పోటీ జరిగింది. అయితే వీరిద్దరూ నిర్ణీత 2.39 మీటర్ల ఎత్తును దూకడంలో విఫలమయ్యారు. ఇద్దరూ 2.37 మీటర్లు మాత్రమే దూకారు. ఇద్దరూ ఒకే ఎత్తుకు దూకడంతో మ్యాచ్ టై బ్రేకర్‌కు దారితీసింది. కానీ టై బ్రేకర్‌లో పోటీ పడేందుకు తాంబెరీ, బార్షిమ్‌ను అంపైర్ పిలువగా.. గోల్డ్ మెడల్‌ను షేర్ చేసుకోవచ్చా, రెండు మెడల్స్ ఇస్తారా అని అంపైర్‌ను బార్షిమ్ అడిగాడు. అవును, పంచుకోవచ్చని అంపైర్ అనడంతో.. తాంబెరీ, బార్షిమ్ ఒప్పుకున్నారు. ఇద్దరు మిత్రులు సంతోషంగా ఆ క్షణాలను సెలబ్రేట్ చేసుకున్నారు. వీరి దోస్తీకి క్రీడా ప్రపంచంతోపాటు అందరూ వహ్వా అంటున్నారు. సోషల్ మీడియాలో వీరి వీడియోలు వైరల్ అవుతున్నాయి.