లాయర్ దంపతుల హత్యకు కారు, కత్తులు అందజేసిన బిట్టు శ్రీను అరెస్ట్

లాయర్ దంపతుల హత్యకు కారు, కత్తులు అందజేసిన బిట్టు శ్రీను అరెస్ట్

లాయర్ దంపతులు గట్టు వామన్ రావు పివి, నాగమణి దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితులతో కుట్రలో పాల్గొని నిందితులకు కారు, రెండు కత్తులను అందజేసిన నాలుగో నిందితుణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్ప‌టికే కుంట శ్రీనివాస్ ,శివందుల చిరంజీవి , అక్కపాక కుమార్ నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా.. బిట్టు శ్రీను ను విచారించి సోమ‌వారం అదుపులోకి తీసుకున్నారు.

ఐజీ నాగిరెడ్డి తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. బిట్టు శ్రీను నడుపుతున్న పుట్ట లింగమ్మ ట్రస్టు పై వామన్ రావు గతంలో కేసులు వేశారు, అలాగే మంథని మున్సిపాలిటీ నుంచి తన కాంట్రాక్ట్ ట్రాక్టర్ ను తొలగించాడు, దీంతో బిట్టు శ్రీను త‌న ఆదాయాన్ని కోల్పోయాడని చెప్పారు. ఈ విష‌యంలో వామన్ రావుపై కక్ష పెంచుకొన్న బిట్టు శ్రీను అందుకు ప్ర‌తీకారం తీసుకుందామ‌నుకున్నాడు. త‌న‌కు స్నేహితుడైన కుంట శ్రీనుకు మ‌ద్యం సేవించే స‌మ‌యంలో వామ‌న‌రావు త‌న ఆదాయంపై ఏ విధంగా దెబ్బ‌కొట్టాడ‌నే విష‌యంపై చ‌ర్చించాడు. అయితే అంత‌కుముందే వామన్ రావుతో కుంట శ్రీనుకు కూడా విరోధం ఉంది. ఓ ఆల‌య‌ నిర్మాణం లో కుంట శ్రీనుకు వామనరావుతో విబేధాలున్నాయి. త‌న ఇంటి నిర్మాణ స‌మ‌యంలో గ్రామ పంచాయ‌తీ అనుమ‌తి లేకుండా నిర్మిస్తున్నాడ‌ని , లాయ‌ర్ వామ‌న‌రావు ఓ నోటీసును ఫ్లెక్సీ గా త‌యారు చేయించి.. ఆ ఫ్లెక్సీ ని సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. దీన్ని అవమానంగా భావించిన కుంట శ్రీను వామ‌న‌రావుపై కోపం పెంచుకున్నాడు.స‌రైన స‌మ‌య‌మిదేన‌ని … అతన్ని చంపేందుకు తాను సహాయం చేస్తానని బిట్టు శ్రీను హామీ ఇచ్చాడని ఐజీ తెలిపారు.

వామన్ రావు హత్యకు నాలుగు నెలల క్రితమే బిట్టు శ్రీను రెండు ఆయుధాలను తయారు చేయించాడు. ట్రాక్టర్ పట్టీలతో రెండు కత్తులను తయారు చేయించినట్టుగా విచారణలో తాము గుర్తించామని ఐజీ చెప్పారు. 10 నెలలుగా వామన్ రావు కోసం బిట్టు గ్యాంగ్ ఎదురు చూస్తోందని, మంథని కోర్టు సమీపంలోనే హత్య చేయాలని ప్లాన్ చేశారు. కానీ అక్కడ సాధ్యం కాలేదని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఇంటి సమీపంలోనే వామన్ రావును హత్య చేయాలనుకొన్నారు కానీ రెండు చోట్ల జనం ఎక్కువగా ఉండడంతో కుంట శ్రీను ప్లాన్ మార్చుకొన్నారని ఐజీ వివరించారు. చివరగా కల్వచర్ల వద్ద వామన్ రావును కుంట శ్రీను , చిరంజీవి సాయంతో హత్య చేశారన్నారు. ఆ త‌ర్వాత నిందితులకు వాహనాలతో పాటు ఆయుధాలను స‌మ‌కూర్చిన‌ బిట్టు శ్రీను.. కుంట శ్రీనుకు ఫోన్ లో.. మీరు మహారాష్ట్రకు వెళ్లిపొండని చెప్పి.. ఇంటి వద్ద ఏం తెలియనట్టు ఉన్నాడ‌ని ఐజీ తెలిపారు. నిందితుల నుంచి ఓ మోటార్ సైకిల్,  ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.