దేశం మొత్తమ్మీద..మన రాష్ట్రంలోనే తక్కువ టెస్టులు

దేశం మొత్తమ్మీద..మన రాష్ట్రంలోనే తక్కువ టెస్టులు

హైదరాబాద్, వెలుగు: దేశం మొత్తమ్మీద కరోనా టెస్టులు అతితక్కువగా చేస్తున్నది మన రాష్ట్రంలోనేనని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్​ రావు ఆరోపించారు. ఎక్కువమందికి టెస్టులు చేయాలని మొదట్నుంచీ తాము డిమాండ్​ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని బుధవారం విమర్శించారు. టెస్టులే చేయకుండా పాజిటివ్​ కేసులు ఎట్లా తెలుస్తయ్.. మరణాలను ఎట్లా లెక్కగడతరని ఆయన నిలదీశారు. ప్రతీ ప్రెస్​మీట్​లో ఐసీఎంఆర్​ గైడ్​లైన్స్, టెస్టింగ్​ ప్రొటోకాల్​ పాటిస్తున్నామని చెబుతూ ప్రజలను మంత్రి ఈటల రాజేందర్ మభ్యపెడుతున్నారని ఆరోపించారు. టెస్టులు చేయకుండా అబద్ధాలు చెబుతూ రాష్ట్ర ప్రజలను డేంజర్​ స్టేజ్​లోకి తీసుకెళుతున్నారని కృష్ణసాగర్​ రావు మండిపడ్డారు. రోజూ విడుదల చేస్తున్న బులెటిన్ లో ఎన్ని టెస్టులు చేస్తున్నరో చెప్పడంలేదన్నారు. వీటన్నింటికీ నైతిక బాధ్యత వహిస్తూ, నైతిక విలువలు ఉంటే మంత్రి ఈటల రాజేందర్ తన పదవికి రాజీనామా చేయాలని కృష్ణసాగర్ రావు డిమాండ్ చేశారు. టెస్టులు చేయకుండా వైరస్ పాజిటివ్​ అని ఎట్లా తేలుస్తరు, ఐసోలేషన్​కు ఎట్లా పంపిస్తరు అని ప్రశ్నించారు. ప్రపంచంలో ఎక్కడాలేని టెక్నాలజీ మన ప్రభుత్వం దగ్గరుంటే మిగతా వారితో కూడా పంచుకోవాలని ఆయన ఎద్దేవా చేశారు. వీలైనంత వరకు ఎక్కువ టెస్టులు చేయాలని ఐసీఎంఆర్, డబ్ల్యూహెచ్ వో చెబుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దేశంలో మా దగ్గరే కరోనా కేసులు, మరణాలు తక్కువని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. తక్కువ టెస్టులు చేయటం వల్ల ప్రభుత్వానికి కలిగే ప్రయోజనం ఏంటో సీఎం కేసీఆర్  చెప్పాలని కృష్ణసాగర్ రావు డిమాండ్ చేశారు.

బెంగాల్ ను తాకిన సూపర్ సైక్లోన్