SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు

SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు

ఐపీఎల్ నేడు (మే 6) హై వోల్టేజ్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ముంబై ఇండియన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. ఇరు జట్లలో స్టార్ ఆటగాళ్లుండడంతో ఈ మ్యాచ్ ఆసక్తి రేపుతోంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లలో దాదాపు ఎలాంటి మార్పులు చేసే అవకాశం కనిపించడం లేదు. అయితే సన్ రైజర్స్ మాత్రం ఒక కీలక మార్పుతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. 

విదేశీ ప్లేయర్ల కోటాలో ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసన్ అదరగొడుతుంటే.. కమ్మిన్స్ తన కెప్టెన్సీతో ఆకట్టుకుంటున్నాడు. అయితే జట్టులో మార్కరం స్థానంలో వచ్చిన మరో విదేశీ ఆటగాడు మార్కో జాన్సెన్ ప్రభావం చూపించలేకపోయాడు. నాలుగు ఓవర్లలో వికెట్ తీయకపోగా 44 పరుగులు సమ్పర్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో జాన్సెన్ స్థానంలో న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ కు అవకాశం ఇవ్వాలని సన్ రైజర్స్ యాజమాన్యం భావిస్తున్నట్టు సమాచారం. 

ఫిలిప్స్ అంతర్జాతీయ క్రికెట్ లో అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. గతేడాది సన్ రైజర్స్ తరపున మెరుపులు మెరిపించాడు. ఈ కారణంగానే విశ్రాంతి పేరుతో జాన్సెన్ ను పక్కన పెట్టొచ్చు. ఈ ఒక్క మార్పు మినహాయిస్తే జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. సన్ రైజర్స్ ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. మరో రెండు మ్యాచ్ ల్లో గెలిస్తే ప్లే ఆఫ్ కు వెళ్తుంది. మరోవైపు ముంబై ఆడిన 11 మ్యాచ్ ల్లో మూడు విజయాలను మాత్రమే సాధించి ప్లే ఆఫ్ నుంచి అధికారికంగా నిష్క్రమించింది.