ఆ మహాతల్లికి విడాకులు కూడా ఇవ్వలేదు: మోదీపై సీపీఐ నారాయణ ఫైర్

ఆ మహాతల్లికి విడాకులు కూడా ఇవ్వలేదు: మోదీపై సీపీఐ నారాయణ ఫైర్

కరీంనగర్: బీజేపీ, ప్రధాని మోదీపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కె నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. ఇండియా కూటమి గెలిస్తే.. ముస్లింలు, హిందువులపై దాడి చేస్తారని ప్రధాని మోదీ రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.  ఈడీ, సీబీఐ, ఎన్నికల కమిషన్ ను మోడీ దుర్వినియోగం చేస్తున్నారని.. చివరకు జ్యడిషియరీని కూడా వాడుకుంటున్నాడని విమర్శించారు. మే 6వ తేదీ సోమవారం జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డితో కలిసి నారాయణ మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ..  "అయోధ్య దేవాలయం పూర్తికాకముందే ఎన్నికల కోసం రామాలయాన్ని ప్రారంభించారు. ఇది ఆగమ శాస్త్రాలకు విరుద్ధమని పండితులు కూడా చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ అంశం కలిసి రాకపోవడంతో మోడీ గ్యారెంటీ ముందుకు తెచ్చారు. ఇది కూడా డూప్లీకేట్ అయిపోయింది.సగానికి సగం ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోతోంది. ఇప్పుడు మంగళసూత్ర అంశాన్ని పట్టుకున్నారు. మంగళసూత్రానికి మోదీనే గౌరవీయడం లేదు.. కనీసం ఆ మహాతల్లికి విడాకులు కూడా ఇవ్వలేదు. గిరిజన రాష్ట్రపతిని చేశామని చెప్పుకుంటూనే ఆమెను ఏ శుభకార్యాలయాలకు పిలవడం లేదు. 

సంవత్సరానికి ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలన్నారు. ఇప్పటికి ఎన్నిచ్చారు. స్విస్ బ్యాంకు నల్లధనం తెచ్చారా?. ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.15 లక్షలన్నారు ఏమైంది. విదేశాల నుంచి డబ్బులు తేకపోగా.. ఇక్కడి నుంచే విదేశాలకు మన డబ్బులు పోయాయి.  రూ.15-16 లక్షల కోట్లు అప్పు తీసుకుని 29 మంది మోడి దత్తపుత్రులు విదేశాలకు పారిపోయారు. వీరిలో విజయ్ మాల్య తప్ప మిగతా వాళ్లంతా గుజరాతీయులే.  కాంగ్రెస్ హయాంలో రిటైల్ కరప్షన్ ఉంటే.. మోడీ వచ్చాక హోల్ సేల్ కరప్షన్ మొదలైంది. అదానీ గుజరాత్ లో ఓగంజాయి స్మగ్లర్. మోదీ, అదానీకి అండగా ఉండటంతో ఆయన వ్యాపార సామ్రజ్యం పెరిగిపోయింది. ఫ్యాషన్ పెరేడ్ లో తప్ప మోడీ ఎందుకు పనికి రాడు. కేజ్రీవాల్ ను చూసి మోడీ ఎందుకు భయపడుతున్నారు?. వందకోట్ల స్కామ్ లో కేజ్రీవాల్ ను, రూ.2 వేల కోట్ల కుంభకోణంలో జార్ఖండ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన మోదీ.. రూ.45 వేల కోట్ల కుంభకోణం చేసిన జగన్ ను ఎందుకు వదిలేశారు. జగన్ మోదీకి మరో దత్తపుత్రుడు.

ఇప్పుడు రేవంత్ రెడ్డిపైకి ఢిల్లీ పోలీసులను మోదీ పంపించి బయపెట్టాలని చూస్తున్నాడు. ఏకగ్రీవాల కోసం బీజేపీ అడ్డదారులు తొక్కుతోంది. ఈ మాత్రం దానికి ఎన్నికలెందుకు?.. ఇన్ని కోట్ల ఖర్చెందుకు?. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే గట్టిపోటీ ఉంది. బీఆర్ఎస్ పని ఇక్కడ ఐపోయింది. అహంభావం, అవినీతివల్లే బీఆర్ఎస్ ఓడిపోయింది. కేంద్రంలో హంగ్ వస్తుందని, తాము కీలక పాత్ర పోషిస్తామని కేసీఆర్ కొత్త రాగం అందుకున్నారు. గాలిలో కేసీఆర్ మేడలు కడుతున్నారు. విభజన చట్టాలు అమలు చేయని బీజేపీనే రెండు రాష్ట్రాలకు ప్రధాన శత్రువు. జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయంతోనే.. తెలంగాణలో తాము పోటీ చేయడం లేదు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్ధతునిస్తున్నాం"  అని చెప్పారు.