- జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో రాష్ట్రాన్ని టాప్లో నిలపాలి: మంత్రి పొన్నం
- రవాణా శాఖ అధికారులతో మంత్రి జూమ్ మీటింగ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రతి రోజూ రోడ్డు ప్రమాదాల్లో 20 మంది వరకు మరణిస్తున్నారని, ఈ రేటును జీరోకు తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించి, మరణాల రేటును తగ్గించడమే లక్ష్యంగా రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పంచాలని రవాణాశాఖ అధికారులకు సూచించారు.
రాష్ట్రంలో వచ్చే నెల 1 నుంచి 31 వరకు జరగనున్న జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవంలో తెలంగాణ ను అగ్ర భాగాన నిలిపేందుకు కృషి చేయాలన్నారు. బుధవారం రవాణా శాఖ అధికారులతో మంత్రి పొన్నం జూమ్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ ఉత్సవాల్లో ఆయా జిల్లాల్లోని మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, జిల్లా కలెక్టర్లను, పోలీసు అధికారులను, కొత్తగా ఎన్నికైన సర్పంచులను, విద్యార్థులను, లారీ, అంబులెన్స్, స్కూల్ బస్సు డ్రైవర్లను భాగస్వాములను చేయాలన్నారు.
జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ర్యాలీలు, మారథాన్ లు, రవాణా శాఖ శకటాల ప్రదర్శన, హెల్మట్ పై అవగాహన, విద్యార్థులకు క్విజ్, వ్యాస రచన పోటీలు, రంగోలీ పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. సీటు బెల్ట్ పెట్టుకోవడంపై అవగాహన, రక్తదాన శిబిరాలు, పాదచారుల భద్రత, వాహనాల ఓవర్ లోడింగ్ పై అవగాహన కల్పించే ప్రోగ్రామ్ లు చేపట్టాలని రవాణా అధికారులను మంత్రి ఆదేశించారు.
ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడం కోసం జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాలను కలెక్టర్ సమక్షంలో ఏర్పాటు చేయాలని, నెల రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని అధికారులను మంత్రి పొన్నం ఆదేశించారు. ఈ మీటింగ్ లో రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, జేటీసీలు చంద్ర శేఖర్ గౌడ్, రమేశ్, శివ లింగయ్య, డీటీసీలు, ఎంవీఐలు పాల్గొన్నారు.
