- ఆ రోజు వీలుకాకుంటే 6న లిస్టింగ్‌కు వచ్చే చాన్స్
హైదరాబాద్, వెలుగు: ఏపీ అక్రమంగా చేపడుతున్న పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు త్వరలోనే విచారణ ప్రారంభించనుంది. కొత్త సంవత్సరం 2026 జనవరి 5న సుప్రీంకోర్టు బెంచ్ ఈ కేసును విచారణకు తీసుకునే అవకాశాలున్నాయి.
పోలవరం స్కోపును మార్చి ఏపీ పీఎన్‌ఎల్‌పీ (పోలవరం నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు) చేపట్టుతున్నదని ఆరోపిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 16న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే డీపీఆర్ తయారీకి టెండర్లు పిలవడంతో.. ఆ ప్రక్రియను వెంటనే ఆపేయాలని, ప్రాజెక్టును చేపట్టకుండా ఏపీని నిలువరించాలని తెలంగాణ ప్రభుత్వం తన పిటిషన్‌లో కోరింది.
వీలైనంత త్వరగా తమ పిటిషన్‌ను విచారించాలని విజ్ఞప్తి చేయగా.. జనవరి 5న ఈ పిటిషన్‌ను కోర్టు లిస్టింగ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఆ రోజు కుదరకపోతే, జనవరి 6న పిటిషన్ బెంచ్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ శనివారమే బెంచ్ ముందుకు రావాల్సి ఉన్నా, కొన్ని అర్జెంట్ కేసుల వాదనల కారణంగా ఆలస్యమవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.
