Shambhala Review: మిస్టికల్ థ్రిల్లర్ ‘శంబాల‌’ రివ్యూ.. ఆది సాయికుమార్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

Shambhala Review: మిస్టికల్ థ్రిల్లర్ ‘శంబాల‌’ రివ్యూ.. ఆది సాయికుమార్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

హీరో ఆది సాయి కుమార్ నటించిన ఫాంటసీ మిస్టికల్ థ్రిల్లర్ మూవీ ‘శంబాల’. యుగంధర్ ముని దర్శకత్వంలో రాజశేఖర్‌‌ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి నిర్మించారు. క్రిస్మస్‌ కానుకగా గురువారం (2025 డిసెంబరు 25న) ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా కథనంపై నమ్మకంతో  ఒకరోజు ముందుగానే..బుధవారం (డిసెంబర్ 24న) ప్రీమియర్స్ ప్రదర్శించారు మేకర్స్. ఈ క్రమంలో సినిమా చూసిన ఆడియన్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. మరి శంబాల రూపంలో ఆదికి సాలిడ్ హిట్ పడిందా లేదా అనేది పూర్తి రివ్యూలో తెలుసుకుందాం.  

కథేంటంటే:

ఈ మూవీ కథనం 1980ల నాటి వాతావరణంలో, శంబాల అనే మారుమూల గ్రామం చుట్టూ తిరుగుతుంది. అనూహ్యంగా ఆ ఊరిలో ఆకాశం నుంచి ఓ ఉల్క పడుతుంది. అప్ప‌ట్నుంచి ఊరిలో అనూహ్యమైన సంఘ‌ట‌న‌లు జ‌రగ‌డం మొద‌ల‌వుతాయి. ఈ క్రమంలో ప్రతి ఒకరిలో వింత మార్పులు రావడం మొదలవుతుంది. మొదటగా శంభాలకి చెందిన ఓ రైతు రాములు (రవి వర్మ) ఆవు నుంచి పాలుకు బదులుగా రక్తం వస్తుంది. దాంతో అక్కడి మనుషుల్లో మూఢనమ్మకం బలంగా నాటుకుపోతుంది. ఆ ఆవుని సజీవసమాధి చేస్తే తప్ప ఫలితం రాదని ఆ ఊరి స్వామీజీ చెప్తాడు. ఇక ఆ ఆవును చంపాలని ఊరి జనాలు డిసైడ్ అవుతారు.

ఇదే సమయంలో ఆ రాయిని పరీక్షించేందుకు ఢిల్లీ నుంచి జియో-సైంటిస్ట్ విక్రమ్‌ (ఆది సాయికుమార్‌) శంబాలకు వస్తాడు. చావులోనూ సైన్స్‌ ఉందనే నమ్మే వ్యక్తి విక్రమ్‌. వచ్చి రావడంతోనే ఊరి జనాన్ని ఎదిరించి, ఆ ఆవుని చంపకుండా అడ్డుకుంటాడు. అలాంటి వ్యక్తి శంబాలకు వచ్చిన తర్వాత వరుస హత్యలు జరుగుతుంటాయి.రాములుతో సహా పలువురు గ్రామస్తులు వింతగా ప్రవర్తిస్తూ కొంతమందిని చంపి..వాళ్లు చనిపోతుంటారు. దానికితోడు ఎవ‌రో ఒక‌రు విచిత్రంగా ప్ర‌వ‌ర్తిస్తూ హ‌త్య‌లు చేయడం, తమకి తామే ఆత్మ‌హ‌త్య‌ల‌కు పూనుకోవడం సంభవిస్తుంటాయి.

ఈ క్రమంలో అంతుచిక్కని రహస్యాలుగా మారుతుంది శంబాల. ఆ రహస్యాలను ఛేదించేందుకు విక్రమ్‌ ఎలాంటి సాహసం చేశాడు? ఆ ఊరి చావులకు, ఉల్కకు సంబంధం ఏంటీ? ఈ క్రమంలో ఎలాంటి రహస్యాలు కనుక్కున్నాడు విక్రమ్? అసలు శంబాల గ్రామ చరిత్ర ఏంటి? ఊర్లో విక్రమ్‌కి తోడుగా నిలిచిన దేవి (అర్చనా అయ్యర్) ఎవరు? దేవి అనే అమ్మాయి..సైంటిస్ట్ విక్రమ్‌కు మాత్రమే ఎందుకు కనిపిస్తుంది? ఈ వింత చావుల వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? రహస్యాన్ని ఛేదించేందుకు గ్రామస్థులు విక్రమ్‌కు సహకరించారా? చంపేముందు, చచ్చే ముందు మెడలో వాలే ఓ పురుగులాంటి శక్తి కథేంటి? చివరికి శంబాల ఏమైంది? వంటి తదితర అంతుచిక్కని రహస్యాలు తెలియాలంటే శంబాల థియేటర్స్‌లో చూడాల్సిందే.

విశ్లేషణ:

లాజిక్‌కు, మర్మమైన శక్తులకు మధ్య జరిగే భీకర పోరాటమే సినిమా కథాంశం. శంబాల ఊరిలో జరుగుతున్న అంతుచిక్కని హత్యలు, అతీంద్రియ సంఘటనలు గమనిస్తే.. "సైన్స్‌ గొప్పదా? శాస్త్రం గొప్పదా? అనే ప్రశ్న ఇస్తుంది. ఇటువంటి సమయంలోనే దేవుళ్లు, అద్భుతాలు అంటూ దేనినీ నమ్మని హేతువాది అయిన జియో-సైంటిస్ట్ విక్రమ్‌కు, ఈ మిస్టికల్ శక్తిని ఛేదించడం ఒక పెను సవాల్ మారుతుంది.

అయితే, 2025 నాటికీ ఎంత టెక్నాలజీ పెరిగిన సైన్స్‌ గొప్పదా? శాస్త్రం గొప్పదా? అనే ఈ ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పలేరు. అలాంటి ఓ మిస్టికల్ కాన్సెప్ట్ తీసుకుని దర్శకుడు యుగంధర్‌ ముని సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఈ చిత్రాన్ని గతంలో ఎప్పుడూ భారతీయ తెరపై చూపించని పాయింట్‌తో, అద్భుతమైన విజువల్స్‌తో తీర్చిదిద్దారు. మొదటి భాగం ఆసక్తికరంగా నడుస్తే, రెండో భాగంలో కథ కొంచెం ప్రెడిక్టబుల్‌గా అనిపిస్తుంది.

ఇందులో పురాణాల్లోని బ్యాక్ స్టోరీని సాయి కుమార్ వాయిస్ ఓవర్తో చెప్పించడం సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఇది ఆడియెన్స్కి ఒక కొత్త సమాచారాన్ని అందించినట్టు అనిపిస్తుంది. స్క్రీన్‌ప్లే చాలా కొత్తగా ఉంటుంది.  ప్రతి ఐదారు నిమిషాలకు ఒక థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఇచ్చిన విధానంతో.. కథనంపై మరింత ఆసక్తి  పెరుగుతుంది.

ఫస్టాఫ్.. ఊరు, దాని వెన‌క చ‌రిత్ర, మూఢ న‌మ్మ‌కాలు, హీరో ఎంట్రీ, ఊరి జ‌నాల్లోకి బండ‌భూతం ఆవ‌హించిన త‌ర్వాత క‌థ‌లో అస‌లు సిస‌లు ఉత్కంఠ, హార‌ర్ కోణం  స్టార్ట్ అవుతుంది. ఈ క్రమంలో ర‌వివ‌ర్మ‌, మీసాల ల‌క్ష్మ‌ణ్ పాత్రలు హైలెట్గా నిలిచాయి. వీరి కోణంలో రాసుకున్న సీన్స్ సినిమాని మ‌రోస్థాయికి తీసుకెళ‌తాయి. రవివర్మ పాత్ర సన్నివేశాలే భయపెట్టేలా ఉంటే..అంతకు రెండింతలు అన్నట్లుగా మీసాల లక్ష్మణ్‌ పాత్రకు సంబంధించిన సన్నివేశాలు భ‌య‌పెడ‌తాయి. ఇలా ఫస్టాఫ్ స‌న్నివేశాల‌న్నీ ఆస‌క్తిక‌రంగా సాగుతాయి. కొన్ని సీన్స్ అయితే.. ప్రేక్షకుడి వెన్నులో వణుకు పుట్టించేలా ఉంటాయి. ఇంటర్వెల్‌ వచ్చే ట్విస్ట్‌ కి ఆడియన్స్ మైండ్ బ్లాంక్ అవుతుంది. ఈ క్రమంలో ఆ ట్విస్ట్ ఇచ్చిన వైబ్ సెకండాఫ్‌పై మరింత క్యూరియాసిటీ పెంచుతుంది.

ఆ తర్వాత సినిమా మరింత రసవత్తరంగా మారుతుంది. విక్రమ్ ఆ ఊరి సమస్యను తీర్చేందుకు చేసే ప్రయత్నాలు, ఇన్వెస్టిగేషన్ ప్రేక్షకులకి మంచి థ్రిల్ అందిస్తుంది. శంబాల గ్రామ దేవ‌త చ‌రిత్ర‌, ఉల్క ప‌డ‌టంతో నెలకొన్న ప‌రిణామం, అరిష‌డ్వ‌ర్గాల కోణం వివరించిన విధానం ఆసక్తికరంగా ఉంటుంది. ఇటువంటి సమయంలో ఓ చిన్నపాపతో క్లైమాక్స్ రాసుకుని ముడిపెట్టిన విధానం ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది. ఓవరాల్గా చెప్పాలంటే.. అసలు శంబాలకి ఏమైందనే కోణాన్ని కనుగొనే ప్రక్రియ చివ‌రివరకు ఉత్కంఠ పెంచుతోంది.

ఎవరెలా నటించారంటే:

ఆది సాయి కుమార్ యాక్టింగ్ సినిమాకు ప్లస్ అయింది. ఇలాంటి బలమైన కథకి ఆది చూపించిన ఇంటెన్సిటీ, ఆహార్యం.. విక్రమ్ పాత్రకి మరింత బలాన్ని ఇచ్చింది. యాక్షన్‌తో పాటు ఎమోషనల్‌ సన్నివేశాల్లోనూ మెప్పించాడు. దేవి పాత్ర ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఈ పాత్రలో అర్చన అయ్యర్‌ ఒదిగిపోయి నటించింది. ఇక కీలక పాత్రల్లో నటించిన ర‌వివ‌ర్మ‌, మీసాల ల‌క్ష్మ‌ణ్, ఇంద్ర‌నీల్‌, మ‌ధునంద‌న్‌,  శైల‌జ ప్రియ‌, బేబి ఛైత్ర,శ్వాసిక తదితరులు న్యాయం చేశారు.

టెక్నీకల్ అంశాలు:

శ్రీచరణ్‌ పాకాల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ & సౌండ్ డిజైన్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను బాగా ఎలివేట్ చేశాయి. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పతాకస్థాయిలో తీసుకొచ్చి సక్సెస్ అయ్యాడు. ప్రవీన్‌ కె బంగారి సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ప్రధాన బలంగా నిలిచింది. గ్రామీణ వాతావరణాన్ని చాలా బాగా చూపించారు. విజువల్ ఎఫెక్ట్స్, VFX  వర్క్‌ తక్కువే ఉన్నప్పటికీ.. ఎక్కడా లోపించకుండా ఉంది. ఎడిటర్‌ శర్వణ్‌ ఒకే. చివరగా.. ద‌ర్శ‌కుడు యుగంధ‌ర్ థ్రిల్లింగ్ కథనంతో వచ్చి సక్సెస్ అయ్యాడు. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్ మేకింగ్‌లో శిక్షణ పొందిన యుగంధర్ ముని.. హాలీవుడ్ స్థాయి నిర్మాణాన్ని లక్ష్యంగా చేసుకుని హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో, గ్రాండ్ విజువల్స్‌తో శంభాల మూవీని రూపొందించి శభాష్ అనిపించుకున్నారు.