- ఫేజ్ 5(ఏ) ప్రాజెక్టు కింద 3 ఏండ్లలో 13 కొత్త స్టేషన్లు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్ర సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫేజ్ 5(ఏ) ప్రాజెక్టు కింద 3 కొత్త కారిడార్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. సుమారు 12,014.91 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించిన కేంద్ర కేబినెట్ సమాశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఫేజ్ 5(ఏ)లో భాగంగా16 కిలోమీటర్ల మేర 13 కొత్త స్టేషన్లు నిర్మించనున్నారు. ఇందులో10 భూగర్భ స్టేషన్లు కాగా.. 3 ఎలివేటెడ్ స్టేషన్లుగా నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టుతో ఢిల్లీ మెట్రో మొత్తం పొడవు 400 కిలోమీటర్లకు చేరుకుంటుంది. ఈ కొత్త మార్గాల వల్ల ప్రతిరోజూ దాదాపు 60 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు, 2 లక్షల మంది సందర్శకులకు ప్రయోజనం చేకూరనున్నది.
ముఖ్యంగా వెస్ట్, నార్త్, ఓల్డ్ ఢిల్లీ ప్రాంతాలు సెంట్రల్ ఢిల్లీతో నేరుగా అనుసంధానమవుతాయి. ఈ ప్రాజెక్టు వల్ల రోడ్లపై ట్రాఫిక్ రద్దీ తగ్గడమే కాకుండా, ఇంధన వినియోగం తగ్గి కాలుష్యం కూడా తగ్గుతుందని కేంద్ర సర్కారు భావిస్తున్నది. కాగా, ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు సంయుక్తంగా నిధులు సమకూరుస్తాయి. కాగా, ప్రస్తుతం కొనసాగుతున్న ఫేజ్-4 పనులు 2026 డిసెంబర్ నాటికి దశలవారీగా పూర్తి కానున్నాయని అధికారులు తెలిపారు.
