- రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) పదవిలో నియామకానికి అర్హులైన ఐపీఎస్ ఆఫీసర్ల ప్యానెల్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ)కి పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. యూపీఎస్సీ పంపే పేర్లను ఆమోదించి, ఆ నివేదికను తమకు అందజేయాలని.. సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంటూ నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను జనవరి 20కి వాయిదా వేసింది. ఈలోగా డీజీపీ నియామకంపై స్టే ఉత్తర్వులు జారీ చేయాలన్న పిటిషనర్ వినతిని తోసిపుచ్చింది.
తెలంగాణ డీజీపీగా శివధర్‌రెడ్డిని నియమించడాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ కు చెందిన సోషల్ వర్కర్ టి.ధన్‌గోపాల్ రావు వేసిన రిట్‌ను జస్టిస్ పుల్లా కార్తీక్ బుధవారం విచారించారు. డీజీపీ నియామకం కోసం సెప్టెంబర్ 2025న సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులు 2018లో సుప్రీంకోర్టు జారీ చేసిన గైడ్‌లైన్స్‌కు వ్యతిరేకంగా ఉన్నాయని పిటిషనర్ వాదించారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఎ. సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కమిషన్‌కు పంపిన ప్యానెల్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, యూపీఎస్సీ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించగా, తెలంగాణలో పని చేస్తున్న 1994 బ్యాచ్ అధికారి అభిలాష బిస్త్‌ను ప్యానెల్‌లో చేర్చవచ్చా? అని కమిషన్‌ను ప్రభుత్వం అడిగిందని, అందుకు యూపీఎస్సీ నుంచి ప్రతికూల సమాధానం వచ్చిందన్నారు. అయితే, కమిషన్ కోరిన వివరణలు, ప్రభుత్వం నుంచి వచ్చిన సమాధానాల్లో లోపాల కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యమైందని యూపీఎస్సీ తరపు న్యాయవాది అజయ్ కుమార్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల మేరకు అడిగిన వివరాలు పంపితే.. ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు. పార్టీ ఇన్ పర్సన్(పిటిషనర్) వాదనలు వినిపిస్తూ.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా చేపట్టిన శివధర్‌రెడ్డి నియామకం చట్టవిరుద్ధమన్నారు. రెండు నెలలకుపైగా నిబంధనలకు విరుద్ధంగా ఆయన పదవిలో కొనసాగుతున్నారని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. శివధర్‌రెడ్డి నియామక రద్దుకు నిరాకరించారు. యూపీఎస్సీకి ఎంపిక ప్యానెల్‌ను పంపే ప్రక్రియ కొనసాగించాలని ఆదేశించారు.
