హనుమకొండ/ ములుగు, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకా వెంకటస్వామి మెమోరియల్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ 20 క్రికెట్ లీగ్ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. వరంగల్ జిల్లాలోని మొగిలిచెర్ల, జనగామ జిల్లాలోని వంగాలపల్లి, ములుగు జిల్లా జాకారం గ్రౌండ్ లో రెండు సెషన్స్ లో పోటీలు జరగగా, క్రీడాకారులు పరుగుల వరద పారించారు. వంగాలపల్లిలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ పోటీలను ప్రారంభించారు. మూడురోజుల పాటు జరగనున్న ఈ టీ 20 క్రికెట్ లీగ్ లో మొదటి రోజు ఆరు మ్యాచ్ లు నిర్వహించారు.
కాకా కుటుంబం సేవలు మరవలేనివి..
కాకా వెంకటస్వామి పేదల అభ్యున్నతికి కృషి చేశారని, ఆయన ఫ్యామిలీ సమాజానికి చేస్తున్న సేవలు మరువలేనివని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. జనగామ జిల్లా వంగాలపల్లి గ్రౌండ్ లో కాకా వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ పోటీలను వరంగల్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం క్రీడాభివృద్ధికి కృషి చేస్తోందన్నారు.
క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కాకా వెంకటస్వామి మెమోరియల్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మూడు తరాల కాకా కుటుంబం క్రీడాకారులు ప్రోత్సహిస్తుండటం హర్షనీయమన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గుండేటి రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గోరంట్ల రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు సదాశివ, జాయింట్ సెక్రటరీ బస్వరాజు ఉపేందర్, కార్యవర్గ సభ్యులు అభినవ వినయ్, శంకర్, జాకారంలో ములుగు జిల్లా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు సందీప్ నేత్ర తదితరులు పాల్గొన్నారు.
