- జిల్లాలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
- రోజంతా చల్లటి గాలులు.. వణికిపోతున్న జనం
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరిగిపోతోంది. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రంగా ఉంటుండడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఉదయాన్నే పనులకు వెళ్లే కూలీలు, ఉద్యోగస్తులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
పొద్దంతా చల్లాటి గాలులు వీస్తుండటంతో వృద్ధులు బయటకు రాలేకపోతున్నారు. బుధవారం జిల్లాలోని బోరజ్ మండలంలో 8.3 డిగ్రీలు, తాంసిలో 8.4, బజార్ హత్నూర్‌లో 8.6లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయానికి 13.3 డిగ్రీలు నమోదు కాగా ఈ సారి ఉష్ణోగ్రతలు 7 డిగ్రీలకు పడిపోతున్నాయి. వచ్చే నెలలో 5 డిగ్రీలకు పడిపోయే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
