న్యూ ఇయర్ వేళ సీఎం రేవంత్ గుడ్ న్యూస్: చిన్న గ్రామాలకు రూ.5 లక్షలు, పెద్ద గ్రామాలకు రూ.10 లక్షలు

న్యూ ఇయర్ వేళ సీఎం రేవంత్ గుడ్ న్యూస్: చిన్న గ్రామాలకు రూ.5 లక్షలు, పెద్ద గ్రామాలకు రూ.10 లక్షలు

హైదరాబాద్: నూతన సంవత్సరం వేళ గ్రామాలపై సీఎం రేవంత్ రెడ్డి వరాలు జల్లు కురిపించారు. నూతన సంవత్సరంలో గ్రామాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తామని గుడ్ న్యూస్ చెప్పారు. చిన్న గ్రామాలకు రూ.5 లక్షలు, పెద్ద గ్రామాలకు రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించారు. గ్రామాలకు యధావిధిగా వచ్చే నిధులు కాకుండా సీఎం ఫండ్స్ నుంచి ప్రత్యేక నిధులు ఇస్తామని చెప్పారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులకు ఇవి అదనమని పేర్కొన్నారు. బుధవారం (డిసెంబర్ 24) నారాయణపేట జిల్లా కోస్గిలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరై 180 మంది సర్పంచ్‌లు, 180 మంది ఉప సర్పంచ్‌లు, 1,739 మంది వార్డు సభ్యులకు సన్మానం చేశారు. 

అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘గ్రామానికి ఏం కావాలో ప్రణాళికలు రాసుకుని రండి.. చిన్న గ్రామాలకు రూ.5 లక్షలు.. పెద్ద గ్రామాలకు రూ.10 లక్షలు ఇస్తా. సీఎం ప్రత్యేక ఫండ్ నుంచి ఈ నిధులు ఇస్తాం. ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధం లేకుండా నిధులిస్తా. కేంద్రం నుంచి వచ్చే నిధులకు ఇవి అదనం. ఈ నిధులతో గ్రామ సమస్యలను పరిష్కరించండి’’ అని గ్రామాలకు సూచించారు. 

కొడంగల్ నా ప్రాణంతో సమానం:

కొడంగల్ నియోజకవర్గం నా ప్రాణంతో సమానమని.. నియోజకవర్గంలోని ప్రతి పౌరుడు నా కుటుంబ సభ్యుడేనన్నారు. కొడంగల్ గడ్డే తెలంగాణకు నాయకత్వం వహిస్తోందని.. మీరు నన్ను ఆశీర్వదించడంతోనే ఈ ఘనత సాధ్యమైందన్నారు. కొడంగల్‎లోని ప్రతి తండా, గూడానికి రోడ్లు వేయిస్తానని.. దేశానికే ఆదర్శంగా కొడంగల్‏ను తీర్చిదిద్దుతానని అన్నారు. 

ALSO READ : రాహుల్‎ను ప్రధాని చేయడమే ప్రియాంక ఏకైక లక్ష్యం

రేషన్ కార్డు రాని కుటుంబం ఏదో సర్పంచులు వివరాలు సేకరించాలని.. అప్లికేషన్ పెట్టుకోగానే రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. ఉచిత కరెంట్ రాని ఫ్యామిలీ డీటెయిల్స్ నాకు ఇవ్వండన్నారు. పారిశ్రామిక వాడను కొడంగల్ లో అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఎన్నికలు ముగిసినయ్.. ఇక రాజకీయాలు ఉండవన్నారు. ప్రతి సర్పంచ్ గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు.