కోల్‌బెల్ట్, వెలుగు: కాకా వెంకటస్వామి మెమోరియల్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం 13 బెటాలియన్ పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగిన పోటీలను బెటాలియన్కమాండెంట్ వెంకటరాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు ఈ టోర్నీని నిర్వహించడం గొప్పవిషయమన్నారు. యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కొద్దిసేపు క్రికెట్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. విశాక ఇండస్ట్రీస్సౌజన్యంతో హెచ్ సీఏ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయిలో నాలుగు రోజుల పాటు పోటీలు నిర్వహించనున్నారు. మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల జట్లు పోటీల్లో తలపడుతున్నాయి. కార్యక్రమంలో 13 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్లు కాళీదాస్, బాలయ్య, హెచ్సీఏ జిల్లా కోచ్ప్రదీప్, సభ్యుడు తిరుపతి బెటాలియన్ ఆర్ఐలు, ఆర్ఎస్సైలు పాల్గొన్నారు.
గెలిచిన ఆదిలాబాద్, మంచిర్యాల జట్లు
మొదటి రోజు రెండు లీగ్ మ్యాచ్‌లు జరిగాయి.మొదటి మ్యాచ్‌లో నిర్మల్‌పై ఆదిలాబాద్జట్టు గెలిచింది. టాస్ గెలిచిన నిర్మల్ మొదట బ్యాటింగ్ చేసి 18 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 141 రన్స్ చేసింది. సందీప్, ఆర్.శ్రీప్రధాన్ చెరో 25 రన్స్ చేశారు.
ప్రత్యర్థి బౌలర్లు అనాస్ సయ్యద్, మహ్మద్అనాస్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆదిలాబాద్ జట్టు 16.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బ్యాటర్ చందన్ 10 ఫోర్లు, ఓ సిక్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 72 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కించుకున్నాడు.
9 వికెట్ల తేడాతో గెలిచిన మంచిర్యాల
మధ్యాహ్నం జరిగిన రెండో మ్యాచ్‌లో మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా జట్లు తలపడగా.. మంచిర్యాల ఘన విజయం సాధించింది. ఆసిఫాబాద్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 119 రన్స్ మాత్రమే చేసింది. సందేశ్(46) టాప్ స్కోరర్. అనంతరం బ్యాటింగ్ దిగిన మంచిర్యాల ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి కేవలం 8 ఓవర్లతో 121 రన్స్‌చేసి విజయం సాధించింది. నిఖిల్ సాయి 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో విజృంభించి 78 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతడికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
