న్యూఢిల్లీ: ప్రపంచంలోని అత్యంత పురాతనమైన ఆరావళి పర్వత ప్రాంతాల్లో మైనింగ్‌పై కేంద్రంలోని మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరావళి పర్వత శ్రేణిలో కొత్త మైనింగ్ లీజులను మంజూరు చేయడంపై పూర్తిగా నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ శాఖ బుధవారం (డిసెంబర్ 24) ఉత్తర్వులు జారీ చేసింది. ఆరావళి శ్రేణిలో కొత్త మైనింగ్ లీజులను జారీ చేయడాన్ని వెంటనే నిలిపివేయాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.
ఆరావళిలో ఇకపై ఎలాంటి మైనింగ్ జరగదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. జీవవైవిధ్యాన్ని పరిరక్షించడంలో ఆరావళి కీలక పాత్ర పోషిస్తుందని.. దాని దీర్ఘకాలిక రక్షణకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని పేర్కొంది. ఆరావళిలో మైనింగ్‌పై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడంతో పర్యావరణ వేత్తలు, పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అసలు వివాదం ఏంటీ..?
ప్రపంచంలో అత్యంత పురాతనమైన ఆరావళి పర్వతాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త నిర్వచనాన్ని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా కొందరు పర్యావరణ ప్రేమికులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆరావళి పర్వతాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త నిర్వచనాన్ని ఆమోదించింది. ఈ మేరకు 2025, నవంబర్ 20న కీలక తీర్పు వెలువరించింది.
కొత్త నిర్వచనం ప్రకారం.. ఆరావళి పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో స్థానిక భూమట్టం నుంచి 100 మీటర్లు (328 అడుగులు) లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న ప్రాంతాలను మాత్రమే ఆరావళి పర్వతాలుగా పరిగణిస్తారు. ఈ ప్రాంతాల్లో మైనింగ్ పూర్తిగా నిషేధం. 100 వంద మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న ప్రాంతాన్ని ఆరావళి పర్వత శ్రేణిగా పరిగణించరు. ఈ ప్రాంతాల్లో మైనింగ్‌కు అనుమతి ఉంటుంది.
కొత్త నిర్వచనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆరావళి పర్వత శ్రేణిలో100 మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న ప్రాంతాల్లో మైనింగ్‌కు కేంద్రానికి అనుమతి ఇచ్చినట్లైంది. దీంతో ఈ 100 మీటర్ల ఎత్తు నిబంధనపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పర్యావరణ వేత్తలు, పర్యావరణ ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, న్యాయవాదులు, పర్యావరణ సంస్థలు ఈ రూల్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా తీవ్ర ఆందోళనలు వ్యక్తం అయ్యాయి.
ఈ 100 మీటర్ల ఎత్తు నిబంధనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే ఆరావళి శ్రేణులలోని దాదాపు 91 శాతం పర్వతాలు 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తులోనే ఉన్నాయని పర్యావరణ వేత్తలు వాదన. ఈ 91 పర్సెంట్ ఏరియాలో తవ్వకాలు జరిగితే మొత్తం ఆరావళి పర్వత శ్రేణి మనుగడ లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ రూల్‌ను కేంద్రం వెంటనే వెనక్కి తీసుకుని ఆరావళిని రక్షించాలని డిమాండ్ చేస్తూ.. ‘‘సేవ్ ఆరావళి’’ అంటూ సోషల్ మీడియాలో భారీ ఎత్తున ఉద్యమాన్ని ప్రారంభించారు. దీంతో గత వారం రోజులుగా సోషల్ మీడియాలో #సేవ్‌ఆరావళి ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఆరావళిలో మైనింగ్‌పై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండటంతో కేంద్రంలోని మోడీ సర్కార్ వెనక్కి తగ్గింది. ఆరావళి పర్వత శ్రేణిలో కొత్త మైనింగ్ లీజులను మంజూరు చేయడంపై పూర్తిగా నిషేధం విధించింది.
►ALSO READ | పుతిన్, జెలెన్ స్కీ కలిసినంత షో చేస్తుర్రు: థాక్రే బ్రదర్స్ పొత్తుపై సీఎం ఫడ్నవీస్ సెటైర్
