పుతిన్, జెలెన్ స్కీ కలిసినంత షో చేస్తుర్రు: థాక్రే బ్రదర్స్ పొత్తుపై సీఎం ఫడ్నవీస్ సెటైర్

పుతిన్, జెలెన్ స్కీ కలిసినంత షో చేస్తుర్రు: థాక్రే బ్రదర్స్ పొత్తుపై సీఎం ఫడ్నవీస్ సెటైర్

ముంబై: రాబోయే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలకు ముందు మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇన్నాళ్లు ఉప్పు నిప్పుగా ఉన్న థ్రాకే బ్రదర్స్ (ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రే) బీఎంసీ ఎన్నికల ముంగిట ఒక్కటయ్యారు. పంతం వీడి చేతులు కలిపారు థాక్రే సోదరులు. బీఎంసీ ఎన్నికల్లో ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన (యుబిటి), రాజ్ థాక్రే ఆధ్వర్యంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) కలిసి పోటీ చేయనున్నట్లు బుధవారం (డిసెంబర్ 24) అధికారికంగా ప్రకటించారు. 

ఈ క్రమంలో థాక్రే బ్రదర్స్ రీయూనియన్‎పై స్పందించిన సీఎం ఫడ్నవీస్ సెటైర్లు వేశారు. బుధవారం ముంబైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. థాక్రే బ్రదర్స్ కలవడం ఏదో పెద్ద ఇంటర్నేషనల్ ఇష్యూలా హైప్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రష్యా, ఉక్రెయిన్ కలిసి పోయినట్లుగా.. జెలెన్స్కీ, పుతిన్ మాట్లాడుకుంటున్నారనే విధంగా హైప్ సృష్టిస్తున్నారని చమత్కరించారు. ఈ రెండు పార్టీలు ఎప్పుడో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని.. ఇప్పుడు వారి ఉనికి కాపాడుకోవడానికే థాక్రే బ్రదర్స్ మళ్లీ కలుస్తున్నారని ఆరోపించారు.

►ALSO READ | రాహుల్‎ను ప్రధాని చేయడమే ప్రియాంక ఏకైక లక్ష్యం: డీకే శివకుమార్

థాక్రే సోదరుల కూటమి బీఎంసీ ఎన్నికల ఫలితాన్ని ఏ మాత్రం ప్రభావితం చేయదని.. ముంబై ఓటర్లు అధికార మహాయుతి కూటమికి అండగా నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ముంబై ప్రజలు మేము చేసిన అభివృద్ధి పనులను చూశారని.. వాళ్లు మాతోనే ఉంటారన్నారు. థాక్రే సోదరుల ట్రాక్ రికార్డ్ అంతా అవినీతి, స్వార్థపూరితమైనదని విమర్శించారు. వాళ్ల పొత్తు సొంత రాజకీయ మనుగడ కోసమేనని.. వీరి కలయిక ముంబై రాజకీయాలపై ఎటువంటి ప్రభావం చూపించదని పేర్కొన్నారు. మరాఠీ ప్రజలు, ముంబైకి ఠాక్రేలు  ఏకైక ప్రతినిధులు కాదని.. ముంబై ప్రజలు మహాయుతి ప్రభుత్వంతో స్థిరంగా నిలబడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.