ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హత్య తర్వాత.. ఆ దేశం తన అత్యంత శక్తివంతమైన, క్రూరమైన రక్షణ కవచాన్ని రంగంలోకి దించింది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల వేళ.. ఆయన భద్రతా బాధ్యతలను ఇరాన్ ఎలైట్ కౌంటర్ టెర్రరిజం ఫోర్స్ 'నోపో'కు అప్పగించారు. బ్లాక్ డ్రెస్ లో ఉండే ఈ స్పెషల్ ఫోర్సెస్ ఇప్పుడు మొజ్తాబా చుట్టూ ఇనుప కవచంలా కాపలా కాస్తున్నారు.
ఎవరీ 'నోపో' ఫోర్స్?
1991లో స్థాపించబడిన ఈ దళానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. ఇరాన్ విప్లవ నేత రుహోల్లా ఖొమేనీ పేరు మీద ఏర్పడిన '28వ రుహోల్లా డివిజన్' నుంచి ఈ యూనిట్ పుట్టుకొచ్చింది. ఇది పరిమాణంలో చిన్నదైనప్పటికీ.. అత్యంత నైపుణ్యం కలిగిన 6 బ్రిగేడ్లను కలిగి ఉంది. ఇందులో 4 బ్రిగేడ్లు రాజధాని టెహ్రాన్‌లో ఉంటే.. మిగిలినవి మషద్, ఇస్ఫాహాన్ నగరాల్లో మోహరించి ఉంటాయి. ఇరాన్ రెగ్యులర్ దళాలైన 'రివల్యూషనరీ గార్డ్స్' (IRGC) కంటే ఈ నోపో దళాలు అత్యంత ప్రమాదకరమైనవి, కఠినమైన శిక్షణ పొందినవి. విధుల్లో వీరు నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తారని రక్షణ నిపుణులు చెబుతున్నారు.
అణచివేతలోనూ మొనగాళ్లు:
ప్రారంభంలో బందీల విముక్తి వంటి హై-ఇంటెన్సిటీ మిషన్ల కోసం ఈ దళాన్ని సృష్టించినప్పటికీ, కాలక్రమేణా వీరి బాధ్యతలు పెరిగాయి. అంతర్గత తిరుగుబాట్లు, ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను అణచివేయడంలో వీరు సిద్ధహస్తులు. గతంలో దేశవ్యాప్త నిరసనల సమయంలో ప్రదర్శనకారులపై కాల్పులు జరపడానికి కూడా వీరు వెనుకాడలేదు. ఇప్పుడు మొజ్తాబా ఖమేనీని కాపాడటంతో పాటు, దేశంలో ఎక్కడైనా నిరసనలు వెల్లువెత్తకుండా అడ్డుకోవడానికి ఈ 'బ్లాక్ క్యాట్' దళాలను ఇరాన్ పాలక యంత్రాంగం ఉపయోగిస్తోంది.
నెతన్యాహు కామెంట్స్:
మరోవైపు.. ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు వ్యాఖ్యలు యుద్ధ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. ఇరాన్ అణ్వాయుధ ఆశయాలను తుంచివేయడమే లక్ష్యంగా సాగుతున్న 'రోరింగ్ లయన్', 'ఎపిక్ ఫ్యూరీ' అద్భుతంగా సాగుతున్నాయని అన్నారు. కొత్త నేత మొజ్తాబా ఖమేనీ గురించి ప్రస్తావిస్తూ.. "ఉగ్రవాద సంస్థల నాయకులు ఎవరైనా సరే.. వారు తమ ప్రాణాలకు గ్యారెంటీ ఇచ్చే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవద్దని నేను సూచిస్తున్నాను" అంటూ పరోక్షంగా మొజ్తాబా కూడా తమ టార్గెట్ లిస్టులో ఉన్నారని నెతన్యాహు బయటపెట్టారు.
