న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల సంస్కృతికి కేసీఆరే ఆద్యుడని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. దేశంలో ఫిరాయింపులకు అమిత్ షా ‘మాస్టర్ మైండ్’ అయితే, తెలంగాణలో ఆ విద్యను పరిచయం చేసింది కేసీఆర్ అని ఫైర్ అయ్యారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఫిరాయింపుల గురించి కేటీఆర్‌కు ఏవైనా సందేహాలు ఉంటే, ఫామ్‌హౌస్‌కు వెళ్లి కేసీఆర్‌ను అడిగి తెలుసుకోవాలని సూచించారు.
గతంలో సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ, ప్రతిపక్షం లేకుండా చేయాలనే కుట్రతో బీఆర్ఎస్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుందని మండిపడ్డారు. ఇతర పార్టీల గుర్తుపై గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డిలకు ఏ ప్రాతిపదికన మంత్రి పదవులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఫిరాయింపుల గురించి ఆ పార్టీ నేతలు మాట్లాడుతుంటే ‘దయ్యాలు వేదాలు వల్లించినట్టు’ ఉందని ఎద్దేవా చేశారు.
