కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలి..రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్

కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలి..రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. బీసీల డిమాండ్ల సాధన కోసం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలోని జంతర్ మంతర్‌ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్ రావు, పాక సత్యనారాయణ, నాగరాజు, రామారావు తదితర నేతలు హాజరయ్యారు.

తెలంగాణ, ఏపీ, కర్నాటక నుంచి పెద్ద సంఖ్యలో సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో బీసీల బతుకుల్లో మార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జాతీయ బీసీ కమిషన్, బీసీ పార్లమెంట్ కమిటీ, జాతీయ బీసీ కార్పొరేషన్ పనిచేస్తున్నాయన్నారు.

అయితే, వీటిని ఏ మంత్రిత్వ శాఖ కింద నడపాలనే దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖలు ఉన్నాయని, ఆయా రాష్ట్రాలు అమలు చేసే పథకాలకు కేంద్రంలో ఏ మంత్రిత్వ శాఖ అనుసంధానం చేయాలని ప్రశ్నించారు.