విజయ్ సర్కార్ కొత్త స్కీం అని చెప్పి.. గుండు కొట్టించుకుంటే రూ.15 వేలు అకౌంట్లో పడతయనేసరికి..

విజయ్ సర్కార్ కొత్త స్కీం అని చెప్పి.. గుండు కొట్టించుకుంటే రూ.15 వేలు అకౌంట్లో పడతయనేసరికి..

సేలం: తమిళనాడులో వింత ఘటన జరిగింది. కరోనాను పోలిన ఒక కొత్త వ్యాధి వ్యాప్తి మొదలైందని.. జుట్టు నుంచి ఈ వ్యాధి వ్యాపిస్తోందని ఫోన్ కాల్ చేశాడు. అయితే.. ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే గుండు చేయించుకోవాలని.. చాలా దేశాల్లో ఇలా గుండు కొట్టించుకున్నారని నమ్మబలికాడు. మరింత నమ్మకం కలగడానికి.. అలా గుండు చేయించుకున్న మహిళలకు ప్రభుత్వం రూ.15 వేలు బ్యాంక్ అకౌంట్లో వేస్తుందని చెప్పాడు. అప్పటి దాకా నమ్మని మహిళలు డబ్బులు బ్యాంక్ అకౌంట్లో వచ్చి పడతాయనగానే నమ్మేశారు. అత్తూరు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది నుంచి కాల్ చేస్తున్నామని చెప్పేసరికి నిజమేననుకుని.. సేలంలో ముగ్గురు వృద్ధ మహిళలు గుండు చేయించుకున్నారు.

జూలై 26వ తేదీ రాత్రి, అత్తూరు సమీపంలోని పుదుకోతంపడికి చెందిన ఒక మహిళకు, తాను అత్తూరు తహసీల్దార్ కార్యాలయ అధికారిని అని చెప్పుకుంటున్న ఒక వ్యక్తి నుంచి ఇలా ఫోన్ కాల్ వచ్చింది. పుదుకోతంపడి నివాసితులకు పరిమిత సంఖ్యలో మాత్రమే టోకెన్లు అందుబాటులో ఉన్నాయని, ఈ పథకాన్ని వినియోగించుకున్న వారు అత్తూరు తాలూకా కార్యాలయం నుంచి డబ్బు తీసుకోవచ్చని ఫోన్ చేసిన వ్యక్తి చెప్పాడు. ఆ పథకం నిజమైనదని నమ్మించడానికి.. గుండు చేయించుకున్న మహిళలు, రూ. 500 నోట్ల కట్టల ఫోటోలు ఉన్న వాట్సాప్ సందేశాలను అదే నంబర్ నుంచి ఆ మహిళకు పంపాడు. ఆ సందేశాలు నిజమైనవేనని నమ్మి, ఆమె ఆ సమాచారాన్ని తన ఇరుగుపొరుగు వాళ్లతో పంచుకుంది.

ఇదంతా నిజమని నమ్మి.. చిత్ర (63), రమయి (62), కావేరి (64) అనే ముగ్గురు మహిళలు స్థానిక సెలూన్‌కు వెళ్లి గుండు చేయించుకున్నారు. తర్వాత సదరు వ్యక్తికి కాల్ చేశారు. ఆ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో మోసపోయామని గ్రహించారు. మంగళవారం అత్తూరు తాలూకా కార్యాలయానికి వెళ్లిన తర్వాత అలాంటి స్కీంలు ఏం లేవని అధికారులు చెప్పడంతో లబోదిబోమన్నారు. ఈ ఘటనపై బాధిత మహిళల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ ఘటనకు సంబంధించి అనుమానంతో ఒక యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.