హోటల్ బిల్లులో గ్యాస్ ఛార్జీలు : ఇదెప్పుడు పెట్టారు సామీ..!

హోటల్ బిల్లులో గ్యాస్ ఛార్జీలు : ఇదెప్పుడు పెట్టారు సామీ..!

హోటల్ లో టిఫిన్ చేశాం.. బిల్లు వచ్చింది.. సహజంగా మనం ఏం తిన్నామో దానికి ఛార్జీ వేస్తారు.. అదనంగా GST ఛార్జీలు కామన్. ఈ హోటల్ మాత్రం వెరీ స్పెషల్.. గ్యాస్ ఛార్జీ అంటూ కొత్త కాలం యాడ్ చేసింది. వంద రూపాయల బిల్లుకు 10 రూపాయలు గ్యాస్ ఛార్జీ వసూలు చేస్తుంది. టిఫిన్ తిన్న కస్టమర్ షాక్ అయ్యాడు.. ఇదేం ట్విస్ట్ సామీ.. ఇదేం బిల్లు అంటూ అవాక్కయ్యాడు. గ్యాస్ లేకుండా వంట ఎలా వండుతారు అంటూ షాక్ అయ్యాడు.. హోటల్ లో గ్యాస్ ఛార్జీలకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

హోటల్‌లో టిఫిన్ చేస్తే మనం తిన్న పదార్థాలకు బిల్లు వేయడం సహజం. అదనంగా జీఎస్టీ వసూలు చేయడం కూడా సాధారణమే. కానీ చెన్నైలోని ఒక హోటల్ మాత్రం బిల్లులో కొత్త అంశాన్ని చేర్చింది. “గ్యాస్ ఛార్జీ” పేరుతో అదనంగా డబ్బు వసూలు చేసిన బిల్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చెన్నైలోని పెరుంగుడి ప్రాంతంలోని ఒక హోటల్‌లో ఓ కస్టమర్ ఇడ్లీ, వడ టిఫిన్ చేశాడు. ఒక్కోటి రూ.33.33గా బిల్లు చేశారు. దీనికి 5 శాతం జీఎస్టీ కలిపి మొత్తం రావాల్సిన బిల్లులో, అదనంగా రూ.9.52 “గ్యాస్ వినియోగ ఛార్జీ” అంటూ చేర్చారు. బిల్లు చూసిన కస్టమర్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. “టిఫిన్‌కు గ్యాస్ ఛార్జీ కూడా వేస్తారా?” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

ఈ బిల్లు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. “ఇదేం కొత్త వసూళ్లు?”, “హోటల్‌లో వంట చేస్తే గ్యాస్ ఖర్చు బిల్లులో వేయడం సరైనదా?” అంటూ ప్రశ్నలు లేవనెత్తారు.

అయితే ఈ విషయంపై స్పందించిన హోటల్ యజమాని మాత్రం ఇది ఫేక్ బిల్లు అని చెప్పారు. ఎవరో బిల్లును ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారని చెప్పారు. తమ హోటల్‌లో గ్యాస్ వినియోగానికి సంబంధించి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయమని స్పష్టం చేశారు.