దేశవ్యాప్తంగా పాల ఉత్పత్తిదారులు, అమ్మే వారికి ఫుడ్ సేఫ్టీ అథారిటీ FSSAI షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇకపై పాలు అమ్మాలంటే కేవలం పాడి ఆవులు, గేదెలు ఉంటే సరిపోదు.. రిటైల్‌గా పావులీటరు, అరలీటరు చొప్పున పాలను అమ్ముకోవాలన్నా ఖచ్చితంగా ప్రభుత్వ లైసెన్స్ ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ముఖ్యంగా డైరీ కోఆపరేటివ్ సొసైటీలలో భాగం కాని పాల వ్యాపారులు అంటే డెయిరీలకు సప్లై చేయకుండా.. ఇంటింటికీ తిరిగి నగరాల్లో, గ్రామాల్లో పాలు అమ్మే వ్యాపారులు వెంటనే ఎఫ్ఎస్ఎస్ఏఐ వద్ద తమ పేర్లను నమోదు చేసుకోవాలని మార్చి 11న అడ్వైజరీ జారీ అయ్యింది. ఎటువంటి అనుమతులు లేకుండా పాలను విక్రయించడం ఇకపై చట్టరీత్యా నేరంగా పరిగణించబడుతుందని పాల వ్యాపారం చేస్తున్న రైతన్నలు గుర్తుంచుకోవాలి.
ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ప్రజారోగ్యంపై పెరుగుతున్న ఆందోళనలే. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో వెలుగు చూసిన భారీ పాల కల్తీ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. పాలల్లో యూరియా, డిటర్జెంట్ వంటి ప్రమాదకర రసాయనాలను కలిపి విక్రయిస్తున్నట్లు ఏపీలో జరిగిన తనిఖీల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే పాలు వినియోగదారులకు చేరేలోపు ఎక్కడ కల్తీ జరుగుతుందో కనిపెట్టడానికి, ప్రతి వ్యాపారిని పర్యవేక్షించడానికి కేంద్రం ఈ రిజిస్ట్రేషన్ డ్రైవ్‌ను చేపట్టింది. రిజిస్ట్రేషన్ లేని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశించింది.
FSSAI has issued an advisory directing all milk producers (other than members of dairy cooperative societies) and milk vendors to obtain mandatory FSSAI registration or license before commencing or continuing their food business operations.#FSSAIAdvisory @MoHFW_INDIA @PIB_India pic.twitter.com/RjZvLwvHTB
— FSSAI (@fssaiindia) March 12, 2026
ఈ కొత్త రూల్స్ వల్ల ప్రధానంగా గ్రామాల్లోని చిన్నపాటి డైరీ ఫామ్ నడిపేవారు, ఇంటింటికీ తిరిగి పాలు పోసే వారు కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అధికారులు కేవలం లైసెన్స్‌లను తనిఖీ చేయడమే కాకుండా.. పాలను నిల్వ చేసే ఫ్రీజర్లు ఎంత పరిశుభ్రంగా ఉన్నాయి? పాలను సరైన ఉష్ణోగ్రత వద్ద భద్రపరుస్తున్నారా? లేదా? అనే అంశాలను కూడా పరిశీలించనున్నారు. పాలు త్వరగా పాడవకుండా ఉండటానికి అనుసరిస్తున్న పద్ధతులపై నిఘా పెట్టడం ద్వారా కల్తీకి అడ్డుకట్ట వేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
డిసెంబర్ 2025 నుంచి అమలులో ఉన్న నిబంధనలను మరింత కట్టుదిట్టం చేస్తూ.. ప్రతి 15 రోజులకు ఒకసారి రిపోర్ట్స్ పంపాలని రాష్ట్రాలకు ఆదేశాలు వెళ్లాయి. దీనికోసం ప్రత్యేక రిజిస్ట్రేషన్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఏపీలో జరిగిన కల్తీ లాంటి ఘటనలు మళ్లీ మళ్లీ రిపీట్ కాకుండా ఉండాలంటే.. పాల వ్యాపారులు తమ బాధ్యతను గుర్తించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ప్రక్రియ వల్ల పాలు విక్రయించే ప్రతి వ్యక్తి ప్రభుత్వ రికార్డుల్లో ఉంటారు కాబట్టి, ఎక్కడ కల్తీ జరిగినా వెంటనే దానికి కారణం అయిన వారిని గుర్తించటం కూడా ఈజీ అవుతుందని ప్రభుత్వం చెబుతోంది.
