నీటి వివాదాలను రాజకీయం చేస్తే రాష్ట్రానికే నష్టం : కూనంనేని సాంబశివరావు

నీటి వివాదాలను రాజకీయం చేస్తే రాష్ట్రానికే నష్టం : కూనంనేని సాంబశివరావు
  • రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం, ఏపీపై పోరాడాలి: కూనంనేని

హైదరాబాద్, వెలుగు: నీటి వివాదాలను రాజకీయ అంశంగా చూస్తే రాష్ట్రానికే నష్టమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శాసనసభలో జరిగే చర్చలో నీటివివాదాల అంశంలో ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలన్నారు. కేసీఆర్ కూడా ఏంచేస్తే బాగుంటుందో, ఎక్కడ పొరపాట్లు జరిగాయో చెబితే మంచిదని సూచించారు. కేసీఆర్  రెండేండ్లు ఇంట్లో ఉండటమే తప్పని, అన్ని సవ్యంగా ఉంటేనే వస్తారా? ప్రజల తీర్పును గౌరవించరా? అని కూనంనేని ప్రశ్నించారు. 

సీపీఐ రాష్ట్ర కార్యవర్గ, కౌన్సిల్ సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను హైదరాబాద్ మక్దూంభవన్ లో బుధవారం సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, ఈటీ నర్సింహ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాల నర్సింహతో కలిసి కూనంనేసి సాంబశివరావు వెల్లడించారు. ఖమ్మం జిల్లాల్లో ‘ఈ నెల 26న’ జరగాల్సిన  సీపీఐ వందేండ్ల ఉత్సవాలను అనివార్య కారణాలతో జనవరి 18న నిర్వహిస్తున్నట్టు కూనంనేని తెలిపారు. ఈ సభను 5 లక్షల మందితో నిర్వహిస్తున్నామన్నారు. జనవరి 18,19, 20, 21 తేదీల్లో జాతీయ సెమినార్, కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.