- రూ. 1.52 కోట్ల విలువైన 304 కిలోల గంజాయి పట్టివేత
దమ్మపేట, వెలుగు : పుష్ప స్టైల్‌లో కంటెయినర్ కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లాకర్‌లో తరలిస్తున్న రూ. 1.52 కోట్ల విలువైన గంజాయిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఎస్సై సాయి కిశోర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని అచ్యుతాపురం క్రాస్ రోడ్డు వద్ద బుధవారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఇదే టైంలో రాజమండ్రి నుంచి సత్తుపల్లి వైపు వస్తున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ కంటెయినర్‌ను ఆపి తనిఖీ చేశారు.
కంటెయినర్ కింద ఉన్న ప్రత్యేకంగా తయారు చేయించిన ఓ లాకర్‌లో 304 కిలోల గంజాయి ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని ఒడిశాలో కొనుగోలు చేసి రాజమండ్రి, అశ్వారావుపేట, సత్తుపల్లి, వీఎం.బంజర, విజయవాడ మీదుగా చెన్నై తరలిస్తున్నట్లు గుర్తించారు.
గంజాయిని తరలిస్తున్న ఏపీలోని చింతపల్లి గ్రామానికి చెందిన వంతల ఏములయ్య, తమిళనాడులోని కాయలమేడు గ్రామానికి చెందిన అర్జున్, షణ్ముఖం, దేవకర్‌ను అదుపులోకి తీసుకోగా.. మరో నలుగురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. గంజాయితో పాటు రూ. 4,500, కంటైనర్, కారు, ఐదు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
