సంక్షోభంలో అంతర్జాతీయ మీడియా సంస్థ.. సీఈఓ రాజీనామా.. భారీగా ఉద్యోగాల కోత!

సంక్షోభంలో అంతర్జాతీయ మీడియా సంస్థ.. సీఈఓ రాజీనామా.. భారీగా ఉద్యోగాల కోత!

ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ 'వాషింగ్టన్ పోస్ట్'లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. సంస్థ సీఈఓ & పబ్లిషర్ విల్ లూయిస్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు శనివారం  ప్రకటించారు.

 రాజీనామా చేయడానికి మూడు రోజుల ముందే వాషింగ్టన్ పోస్ట్  సిబ్బందిలో కొంతమందిని ఉద్యోగాల నుండి తీసివేసింది. సంస్థ భవిష్యత్తు కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని, ఇప్పుడు తాను తప్పుకోవడానికి సరైన సమయమని విల్ లూయిస్ పేర్కొన్నారు. సంస్థ యజమాని, బిలియనీర్ జెఫ్ బెజోస్ తనకు అందించిన మద్దతుకి  కృతజ్ఞతలు తెలిపారు.

విల్ లూయిస్ పదవీకాలంలో వాషింగ్టన్ పోస్ట్ ఎన్నో  సవాళ్లను ఎదుర్కొంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో కమలా హారిస్‌కు మద్దతు తెలపకూడదని యజమాని జెఫ్ బెజోస్ తీసుకున్న నిర్ణయం వల్ల వేలమంది ఈ వార్తాపత్రికను చదవడం మానేశారు. సంస్థలో జరిగిన మార్పుల వల్ల గతంలో టాప్ ఎడిటర్లు కూడా సంస్థను వదిలి వెళ్లారు.

ఉద్యోగాలు కోల్పోయిన వారిలో భారత కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కుమారుడు ఇషాన్ థరూర్ కూడా ఉన్నారు. ఇషాన్ థరూర్ గత 12 ఏళ్లుగా వాషింగ్టన్ పోస్ట్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నారు. తనను ఉద్యోగంలో నుంచి తీసేసినట్లు ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన సహోద్యోగులను కూడా తొలగించడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం  విల్ లూయిస్ స్థానంలో జెఫ్ డి'ఒనోఫ్రియో తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు చేపట్టారు.