వాంఖడే స్టేడియంలో అమెరికాతో జరిగే మ్యాచ్‌తో ఇండియా తన టైటిల్ వేటను ప్రారంభించనుంది. అమెరికా జట్టులో చాలా మంది మన దేశ మూలాలున్న ఆటగాళ్లు ఉండటం విశేషం. ఓ రకంగా అది మినీ ఇండియా టీమ్‌ను తలపిస్తోంది. ముంబైకి చెందిన సౌరభ్ నేత్రావల్కర్, హర్మీత్ సింగ్, శుభమ్ రంజనే ఇప్పుడు అమెరికా జెర్సీలో తమ సొంత మైదానంలో బరిలోకి దిగనున్నారు.
ఈ ముగ్గురికీ వాంఖడే వికెట్‌పై మంచి అనుభవం ఉంది. గత వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌ను ఓడించి, ఇండియాకు గట్టి పోటీనిచ్చి సూపర్–8కు చేరిన అమెరికాను తక్కువ అంచనా వేయలేం. ఆ జట్టు కెప్టెన్ మోనాంక్ పటేల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన వామప్ మ్యాచ్‌లో కేవలం 7 రన్స్ తేడాతో ఓడిపోయిన అమెరికా తమ పోరాట పటిమను చాటుకుంది. అయితే, ఇండియా బౌలింగ్ దాడిని అమెరికా బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరం.
రోహిత్, కోహ్లీ వంటి దిగ్గజాలు లేకపోయినా, 2024లో టైటిల్ గెలిచినప్పటి నుంచి ఇండియా కూడా అద్భుత ఫామ్‌లో ఉంది. గత ఏడాది కాలంలో ఆసియా కప్‌తో సహా తొమ్మిది సిరీస్‌లు గెలిచి వరల్డ్ నంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతోంది. కెప్టెన్ సూర్యకుమార్ తిరిగి ఫామ్‌లోకి రావడం జట్టుకు పెద్ద ఊరట.
Also raed : T20 World Cupలో బోణీ కొట్టిన పాకిస్తాన్..
ఇషాన్ కిషన్, విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ ఇన్నింగ్స్ ఆరంభించడానికి సిద్ధంగా ఉన్నారు. టీ20 ఫార్మాట్‌కు సరిగ్గా సరిపోయే దూకుడు అభిషేక్ శర్మ సొంతం. మిడిల్ ఆర్డర్‌లో తిలక్ వర్మ, ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివమ్ దూబే, ఫినిషర్ రింకూ సింగ్‌తో ఇండియా బ్యాటింగ్ లైనప్ అత్యంత పటిష్టంగా ఉంది.
బౌలింగ్ విభాగంలో జస్‌ప్రీత్ బుమ్రా నాయకత్వం వహిస్తుండగా, అతనికి తోడుగా అర్ష్‌దీప్ సింగ్ ఉన్నాడు. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ప్రత్యర్థులను తిప్పలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. 2007 వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా ఎంతటి ఆధిపత్యాన్ని చూపెట్టిందో ప్రస్తుత ఇండియా అలానే ఉందని మాజీలు, విశ్లేషకులు భావిస్తున్నారు.
