విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మలయాళ డబ్బింగ్ చిత్రం ‘నెల్లిక్కంపోయిల్ నైట్ రైడర్స్’. దర్శకుడు నౌఫల్ అబ్దుల్లా తెరకెక్కించిన ఈ సినిమా హారర్, కామెడీ , మిస్టరీ ఎలిమెంట్స్‌తో సాగే ఒక క్రేజీ రైడ్. ఈ మూవీ జీ5 (ZEE5) ఓటీటీలో సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది.
కథాంశం..
చదువు పూర్తి చేసుకుని తన సొంతూరికి తిరిగి వచ్చిన యువకుడు శ్యామ్ (మాథ్యూ థామస్). పైకి ధైర్యవంతుడిలా కనిపించినా, శ్యామ్‌కు 'నిక్టోఫోబియా' (చీకటి అంటే విపరీతమైన భయం) ఉంటుంది. తన ప్రియురాలు ధన్య (మీనాక్షి ఉన్నికృష్ణన్) ముందు మాత్రం తానొక సాహసికుడిలా నటిస్తుంటాడు. అయితే, నెల్లిక్కంపోయిల్ అనే ఆ ఊరిలో రాత్రివేళల్లో ఒక వింత ఆకారం తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంటుంది. మనిషి శరీరం, గుర్రం కాళ్లు ఉండే ఆ మిస్టీరియస్ క్రియేచర్ (వింత జీవి) కథ ఊరంతా పాకిపోతుంది.
అనుకోకుండా ఒక రాత్రి శ్యామ్ ఆ వింత జీవిని నేరుగా చూస్తాడు. అప్పటివరకు తన భయాన్ని దాచుకున్న శ్యామ్, తన స్నేహితులు (శరత్ సభ, రోషన్ షానవాజ్) సాయంతో ఆ మిస్టరీని ఛేదించాలని నిర్ణయించుకుంటాడు. తన ప్రాణ భయాన్ని పోగొట్టుకుని, ఆ వింత జీవి వెనుక ఉన్న అసలు రహస్యాన్ని శ్యామ్ ఎలా బయటపెట్టాడు? అది నిజంగానే దయ్యమా లేక ఎవరైనా చేస్తున్న కుట్రనా? అనేదే మిగతా కథ.
మాథ్యూ థామస్ తనదైన టైమింగ్, అమాయకత్వంతో శ్యామ్ పాత్రలో ఒదిగిపోయాడు. భయం మరియు కామెడీని సమపాళ్లలో పండించాడు. సినిమా సరదాగా సాగినా, ద్వితీయార్థంలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. రాత్రి పూట తీసిన సన్నివేశాలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాలోని మిస్టరీని మరింత పెంచాయి. శరత్ సభ, రోషన్ షానవాజ్, రోనీ డేవిడ్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ మిస్టరీ థ్రిల్లర్, రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉండి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది.
