Moral Story: స్నేహం ఎలా చేయాలో  తెలుసుకోండి.. ఏనుగుతో చిన్నారి ఫ్రెండ్ షిప్ 

Moral Story: స్నేహం ఎలా చేయాలో  తెలుసుకోండి.. ఏనుగుతో చిన్నారి ఫ్రెండ్ షిప్ 

“ఏనుగమ్మ ఏనుగు...
పొడుగు తొండం ఏనుగు
పొట్టి తోక ఏనుగు
చేట చెవుల ఏనుగు” 

 అని ఊర్లోని పిల్లలు రాములవారి గుడికాడ ఆడుతూ పాడుతూ ఉన్నారు.పొట్టి నిక్కరు, తెల్ల బనియను వేసిన నాలుగేళ్ళ రంజీ కూడా వారితోపాటు ఎగురుతూ పాడుతూ ఉన్నాడు.అప్పుడే.. ఊర్లోకి వచ్చింది నల్ల రంగు ఏనుగు. దాని మెడలో గంటల గొలుసు ఉంది.

ఏనుగును చూసి పిల్లలందరూ పరుగో... పరుగు. ఎందుకంటే వాళ్లెప్పుడూ నిజం ఏనుగును చూసి ఎరుగరు. పుస్తకాల్లో చూసింది. సినిమాల్లో చూసింది తప్పితే.ఎప్పుడూ ఏనుగును చూడని రంజీకి మాత్రం  ఏనుగును చూసి ముచ్చటేసింది. దానికేదైనా బహుమతి ఇవ్వాలనిపించింది. ఇంటికెళ్లి బహుమతి తీసుకొచ్చేలోగా అది వెళ్ళిపోతుందేమోనని అనుమానం వేసింది. చుట్టూరా చూశాడు. ఇవ్వడానికి ఏదీ అందుబాటులో లేదు.

‘అయ్యో...’ అని బాధగా నిక్కరు మీద తట్టాడు. నిక్కరు జేబులోని అమ్మమ్మ ఇచ్చిన అరటిపండు, చేతికి తగిలింది. ఆనందంతో భుజాలు ఎగరేశాడు. గబగబా దాన్ని బయటికి  తీశాడు. పరిగెత్తుకెళ్లి ఏనుగు దగ్గర  నిలబడ్డాడు. ఓరకంటితో ఏనుగు రంజీని చూసింది. రంజీ చేతిలోని అరటిపండు దానికి కనిపించింది. చటుక్కున ఆగింది.

రంజీ అరటిపండును ఒలిచి ఏనుగుకు ఇవ్వబోయాడు. తొక్క తీయొద్దని తలను ఆడిస్తూ సైగ చేసింది. అర్థం చేసుకున్న రంజీ తొక్క తీయడం ఆపేశాడు. ఏనుగుకు అరటిపండు అందించాడు. తొండంతో తీసుకుని నోట్లో పెట్టుకుంది. దాని దగ్గరకు వెళ్లబోయాడు. దూరంగా ఉన్న పిల్లలు ‘వద్దు వద్దు’ అని అరిచారు. అయినా రంజీ వారి మాటలు వినలేదు. దానికి మరింత  దగ్గరగా చేరాడు. ‘వీడి పని అయిపోయింది’ అనుకున్నారు పిల్లలు.  కానీ వాళ్లు అనుకున్నట్లు జరగలేదు. 

అది రంజీని ఏమీ అనలేదు. తొండం పైకెత్తి   ఆశీర్వదించింది. తన మెడ గొలుసు కింద దాచిన చిన్న వెలగ పండును తొండంతో తీసి రంజీ చేతికి ఇచ్చింది. రంజీ ఖుషీ అయ్యాడు. దూరంగా నిలబడి ఉన్న పిల్లలు ఆశ్చర్యపోయారు. ‘భలే భలే’ అని అరిచారు. 

పెద్దపెద్ద అడుగులు వేస్తూ, తోక ఆడిస్తూ  ఏనుగు అక్కడినుంచి కదిలింది.  వెళ్తున్న ఏనుగును చూసి ‘ఏనుగు వెళ్ళిపోతోంది. మనకిక భయం లేదు’ అనుకున్నారు  మిగిలిన పిల్లలు. పరిగెత్తుకుంటూ రంజీ దగ్గరకు వచ్చారు. ‘ ఏనుగు దగ్గరగా వెళ్లావు. స్నేహితుడికి ఇచ్చినట్లు అరటిపండు ఇచ్చావు. నీకు భయం వేయలేదా? అని అడిగారు.

“భయం దేనికి?  అది మన శత్రువు కాదు కదా!” అని ఎదురు ప్రశ్న వేశాడు రంజీ.
‘నిజమే... ఏ జంతువైనా మనం మచ్చిక చేసుకుంటే మనతో స్నేహం చేస్తుంది’ అని తెలుసుకున్నారు పిల్లలు. ఇంతలో దూరంగా గున్న ఏనుగును తోలుకుని వస్తూ మావటివాడు కనిపించాడు వారికి. మచ్చిక చేసుకున్న ఏనుగులను ఊరూరా తిప్పి పల్లె ప్రజలకు  వాటిని చూపిస్తూ డబ్బు, ధాన్యం గడించేవాడు ఆ మావటివాడు.

 అంతే... పిల్లలు ఇండ్లల్లోకి పరుగులు తీశారు. బియ్యం, రాగులు, బెల్లం, చెరుకుగడలు లాంటివి పట్టుకొచ్చి గున్న ఏనుగుకు ఇచ్చారు.  చెవుల్ని టపటపా ఆడిస్తూ ఆ గున్న ఏనుగు పిల్లలిచ్చిన అన్ని తిండి బహుమతుల్నీ తొండంతో తీసుకుని నోట్లో పెట్టుకుంది. పిల్లలందరూ ఎగురుతూ ‘ఏనుగమ్మ ఏనుగు..’ అని పాడుతూ గున్న  ఏనుగు వెంటబడి  నృత్యం చేశారు. 

-ఆర్. సి. కృష్ణస్వామి .తిరుపతి -