- మైనర్‌ను రేప్ చేసిన వ్యక్తికి చట్టం నుంచి మినహాయింపులున్నయా?
- బాధితురాలిపైనే రివర్స్ కేసులు పెడ్తరా?
- బండి సంజయ్‌ని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: బీజేపీ చెబుతున్న బేటీ బచావో కేవలం నినాదానికే పరిమితమా? అని ప్రధాని నరేంద్ర మోదీని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదైతే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. అతడికి చట్టం నుంచి ఏమైనా మినహాయింపు ఉందా? అని శనివారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. బండి సంజయ్ ఎప్పుడు రాజీనామా చేస్తారని, ఆయన్ను మంత్రివర్గం నుంచి ఎప్పుడు బర్తరఫ్ చేస్తారని నిలదీశారు.
‘‘రాహుల్ గాంధీ గారు.. తెలంగాణలో మీ పార్టీ ఎలాంటి జంగిల్ రాజ్ నడుపుతోంది? ఒక మైనర్ బాలిక అన్ని ఆధారాలతో వస్తే పోలీస్ శాఖ ఎందుకు స్పందించలేదు? కేంద్ర మంత్రి కొడుకు కాబట్టే విచారణ జరపడం లేదా? ఇతర ఫోక్సో నేరస్తుల మాదిరిగా ఎందుకు ట్రీట్ చేయడం లేదు?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు. న్యాయం చేయాల్సిన పోలీసులే బాధితురాలిని వేధిస్తున్నారని ఆరోపించారు.
‘‘ఒక 17 ఏండ్ల అత్యాచార బాధితురాలు ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకోవడానికే 3 నెలలు పోరాడాలా? మనం ఎంతటి దుర్భరమైన నరకంలో జీవిస్తున్నాం? ఏ నిబంధన ప్రకారం ఆ బాలికపైనే హనీ-ట్రాప్, వసూళ్ల కేసులు పెట్టారు? ఇది పచ్చిగా విక్టిమ్ షేమింగ్ చేయడమే’’ అని మండిపడ్డారు. న్యాయం జరగక ఆ బాలిక రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీకి ప్రాంచైజీలా కాంగ్రెస్
బీజేపీకి తెలంగాణ కాంగ్రెస్ ఒక ప్రాంచైజీలా పనిచేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఓ మైనర్ గౌరవం విషయంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒక అసహ్యకరమైన ఒప్పందానికి వచ్చారని ఆరోపించారు. ఉన్నావ్ కేసులో బాధితులకు అండగా నిలబడ్డ రాహుల్ గాంధీ.. ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఈ బాధితురాలికి అండగా ఉంటారా? లేక ఈ న్యాయం తెలంగాణ వారికి వర్తించదా? అని ప్రశ్నించారు. ఆడబిడ్డల రక్షణ కోసం గతంలో ఎన్నో పోరాటాలు చేశామని, ఇప్పుడు కూడా తాము వెనకడుగు వేయబోమని స్పష్టం చేశారు. మహిళల గౌరవం కోసం అవసరమైతే మరో మిలియన్ సార్లు పోరాడతామని పేర్కొన్నారు.
