హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ రహిత నగరంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయంలో జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిపై తన విజన్‌ను వివరించారు. నగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు కేవలం రోడ్ల విస్తరణే కాకుండా.. బహుళ విధానాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలని సీఎం స్పష్టం చేశారు. ఇందులో భాగంగా కీలక ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు, ఉపరితల రోడ్లు, అధునాతన ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం, పార్కింగ్ సమస్యల పరిష్కారానికి మల్టీ లెవల్ పార్కింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు.
మూడు జోన్లుగా
- CURE (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ): ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాన్ని 'సర్వీస్ సెక్టార్'గా అభివృద్ధి చేయడం.
- PURE (పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ): ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్య గల ప్రాంతాన్ని 'మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్'గా మార్చడం.
- RARE (రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ): రీజనల్ రింగ్ రోడ్డు అవతల ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయం,దాని అనుబంధ రంగాలను బలోపేతం చేయడం.
హైదరాబాద్ నగర తాగునీటి సరఫరా, పట్టణాభివృద్ధి, మూసీ పునరుజ్జీవం తదితర అంశాలపై ప్రభుత్వ ప్రణాళికలను సమావేశంలో ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్టాండింగ్ కమిటీకి వివరించారు. నగర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించేలా చొరవ చూపాలని ఈ సందర్భంగా ప్రభుత్వం స్టాండింగ్ కమిటీకి విజ్ఞప్తి చేసింది.
►ALSO READ | సికింద్రాబాద్ లో మోదీ సభ.. సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు.. పార్కింగ్ ప్లేసులు ఎక్కడెక్కడంటే.?
