సికింద్రాబాద్ లో మోదీ సభ.. సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు.. పార్కింగ్ ప్లేసులు ఎక్కడెక్కడంటే.?

సికింద్రాబాద్ లో మోదీ సభ.. సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు.. పార్కింగ్  ప్లేసులు ఎక్కడెక్కడంటే.?

ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ టూర్ పై హైదరాబాద్ లో  హై అలర్ట్‌ ప్రకటించారు పోలీసులు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మే 10న ( రేపు) జరగబోయే భారీ బహిరంగ సభకు సంబంధించి పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భద్రతా చర్యలపై మల్కాజ్ గిరి సీపీ సుమతి  కీలక వివరాలను వెల్లడించారు.

ఈ సభకు లక్ష మందికి పైగా జనం హాజరవుతారని అంచనా వేస్తున్న పోలీసులు.. అంగుళం కూడా పొరపాటు జరగకుండా భారీ బలగాలను మోహరించారు. భద్రత కోసం ఏకంగా 2000 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ నియంత్రణ కోసం 550 మంది ట్రాఫిక్ పోలీసులతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ముగ్గురు డీసీపీలు, ఐదుగురు అదనపు డీసీపీల పర్యవేక్షణలో.. 21 మంది ఏసీపీలు, 57 మంది ఇన్ స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో విధులను నిర్వర్తించనున్నారు.

పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో బాంబ్ స్క్వాడ్లు, స్నిఫర్ డాగ్స్, ఆక్టోపస్ , ఎస్.ఓ.టి (SOT) బృందాలతో అణువణువూ తనిఖీలు చేపట్టారు. భద్రతా కారణాల దృష్ట్యా సభా ప్రాంగణంలోకి డ్రోన్లు, కెమెరాలు, బ్యాగులు,బ్యానర్లను పూర్తిగా నిషేధించారు. మే 10న  మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు బేగంపేట్, బోయిన్ పల్లి, మారేడుపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రోన్లపై కఠిన ఆంక్షలు విధించారు.

ట్రాఫిక్ ఆంక్షలు ..పార్కింగ్ ప్రాంతాలు

ఇక వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పరేడ్ గ్రౌండ్స్, బేగంపేట్, ప్యారడైజ్, పాట్నీ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సీపీ తెలిపారు. మొత్తం 12 ప్రత్యేక పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్, భువనగిరి నుంచి వచ్చే బస్సులను ఉప్పల్ వద్దే నిలిపివేయాలని.. అక్కడి నుండి మెట్రో ద్వారా సభకు చేరుకోవాలని సూచించారు.

►ALSO READ | రాత్రంతా మూసీ నదిలోనే.. చెట్ల మధ్య చిక్కుకున్న మహిళ.. కాపాడిన హైడ్రా టీమ్

సభా ప్రాంగణంలో వైద్య, అగ్నిమాపక బృందాలను సిద్ధంగా ఉంచామని.. మీడియా ప్రతినిధులు, నాయకులు భద్రతా నిబంధనలను పాటించాలని కోరారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని సీపీ సుమతి విజ్ఞప్తి చేశారు.