యాక్టర్స్ లైఫ్ అంత ఈజీ కాదు అంటుంటారు సీనియర్ నటులు. యాక్టర్ అవ్వడానికి ముందు ఉండే ప్రయాస అంతా ఇంతా కాదు అంటారు కొత్తతరం నటులు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగడమే వాళ్ల ముందున్న లక్ష్యం. అలా ఎంతో కాలంగా నిరీక్షిస్తూ.. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ తమకంటూ ప్రత్యేక బాటను వేసుకోవాల్సిందే. ఎన్నో సవాళ్ల తర్వాత వరించిన సక్సెస్ వాళ్ల స్థాయిని ఒక్కసారిగా పెంచేస్తుంది కూడా. అలా ప్రస్తుతం సక్సెస్ రూట్లో పయనిస్తోన్న నటి సయానీ గుప్తా. తాను గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టక ముందే ఆమె జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. ప్రతి అడ్డంకిని ఒక అవకాశంగా మార్చుకున్న తీరు ఆమెను స్పెషల్‌గా నిలబెట్టింది. ప్రస్తుతం ‘గ్లోరీ’ అనే సిరీస్‌తో ఓటీటీలో అలరిస్తోంది.
సయానీ గుప్తా.. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో పుట్టింది. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. ఇంట్లో క్రమశిక్షణతోపాటు విలువలు నేర్పించారు. స్వతంత్ర ఆలోచనలకు అవకాశం ఇచ్చారు. పైగా కోల్‌కతా అనగానే గుర్తొచ్చేది కళలు, సాహిత్యం, నాటక రంగం. అలాంటి వాతావరణంలో పెరిగిన ఆమె చిన్నప్పటి నుంచే క్రియేటివ్ ఇండస్ట్రీలపై ఆసక్తి పెంచుకుంది. స్కూల్ టైంలోనే నాటకాల్లో పార్టిసిపేట్ చేయడం మొదలుపెట్టింది. చదువులో కూడా ఆమె చురుకైనదే. ఉన్నత విద్య కోసం ఢిల్లీకి వెళ్లింది. అక్కడ లేడీ శ్రీరామ్ కాలేజీలో చదువుతున్నప్పుడే ఆమె లైఫ్ టర్న్ తీసుకుంది. చదువుతూనే థియేటర్ నేర్చుకోవడం ప్రారంభించింది. అయితే, అది ఆమెను ఎంతగా ప్రభావితం చేసిందంటే.. నాటక ప్రపంచంలో పూర్తిగా మునిగిపోయింది. స్టేజ్‌పై నటించడం ద్వారా తన నటనను మెరుగుపరుచుకుంది. అదే టైంలో నటన తన కెరీర్‌గా మారాలనే ఆలోచన బలపడింది. ఈ నిర్ణయం తీసుకోవడం అంత ఈజీ కాదు, అయినప్పటికీ, తన మనసు చెప్పిన దారినే ఎంచుకుంది.
అసలు పరీక్ష మొదలు
ముంబైకి వచ్చిన తర్వాత అసలు పరీక్ష మొదలైంది. ఆడిషన్లు, రిజెక్షన్లు, అవకాశాల కోసం ఎదురుచూపులు.. ఇవి రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. కొన్నిసార్లు కారణాలు కూడా డిఫరెంట్‌గా ఉండేవి.. ‘పాత్రకు తగ్గట్టు కనిపించడం లేదని, ఇప్పటికే మరొకరిని ఎంపిక చేశామ’ని రిజెక్ట్ చేసేవాళ్లు. వాటికితోడు అంత పెద్ద నగరంలో లైఫ్ లీడ్ చేయడమంటే మాటలు కాదు. దాంతో చాలాసార్లు ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. చిన్న చిన్న పనులు చేస్తూ, తన ఖర్చులు చూసుకుంది. కొన్ని సందర్భాల్లో తను తీసుకున్న డెసిషన్ మీద డౌట్ పడింది. అయినా మళ్లీ తన లక్ష్యాన్ని గుర్తుచేసుకుని ముందుకు సాగింది. సహనం, పట్టుదల, స్వీయ విశ్వాసం ఎంత ముఖ్యమో తెలుసుకుంది. నిజానికి అన్ని రకాలుగా సమస్యలు ఎదుర్కొన్న వాళ్లు ఆ దారి నుంచి తప్పుకోవాలి అనుకుంటారేమో. కానీ వాటిని లెక్కచేయకుండా కెరీర్ మీద ఫోకస్ చేసింది.
సక్సెస్ ఒక్కసారిగా రాలేదు
స్ట్రగుల్స్ అంటే కేవలం ఆర్థిక సమస్యలు మాత్రమే కాదు. మానసిక ఒత్తిడి కూడా ఉంటుంది. ఒకేలాంటి క్యారెక్టర్స్ వచ్చినా, చిన్న పాత్రలు అయినప్పటికీ, ఆమె ఎక్కడా రాజీపడలేదు. బలమైన కథలు, అర్థవంతమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకుసాగింది. సయానీకి సక్సెస్ ఒక్కసారిగా రాలేదు. చిన్న చిన్న విజయాలు కలిసి ఒక పెద్ద స్థాయిని తీసుకొచ్చాయి. ప్రతి పాత్రలో కొత్తదనం చూపించడం ఆమె ప్రత్యేకత. కమర్షియల్ సినిమాలు, కంటెంట్ ఆధారిత కథలు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ తన కెరీర్‌ను నిర్మించుకుంది. కమర్షియల్ సినిమాల కంటే ఓటీటీ కంటెంట్, ఇండిపెండెంట్ సినిమాలకే ఓటేస్తోంది.
గత కొన్నేళ్లుగా ఎక్కువగా పాపులారిటీ తీసుకొచ్చింది వెబ్ సిరీస్‌లే. ‘ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్’ సీజన్ హిట్ కావడంతో ఈ సిరీస్‌లో భాగంగా వస్తోన్న లేటెస్ట్ సీజన్లలోనూ ఆమె పాత్ర కనిపిస్తోంది. ఇందులో ఆమె మోడర్న్, ఇండిపెండెంట్ మహిళగా కనిపించింది. అలాగే ‘ఇన్సైడ్ ఎడ్జ్’ వంటి స్పోర్ట్స్ డ్రామా వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తోంది. ఇది కూడా ఓటీటీలో ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిన ప్రాజెక్ట్. సినిమాల విషయానికొస్తే.. పెద్ద సినిమాలకంటే చిన్న, బలమైన కంటెంట్ ఉన్న సినిమాలనే ఎంచుకుంది. ఆమె నటించిన కొన్ని సినిమాలు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో కూడా ప్రదర్శితమయ్యాయి.
అప్పుడప్పుడు మ్యూజిక్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్ వంటి క్రియేటివ్ ప్రాజెక్ట్స్‌లోనూ భాగమవుతోంది. ఇవి ఆమెకు నటనలో కొత్త ప్రయోగాలు చేయడానికి అవకాశం ఇస్తున్నాయి. మొత్తంగా చెప్పాలంటే సయానీ గుప్తా కెరీర్ స్టార్ డమ్ కంటే ఎక్స్పరిమెంట్ పాత్రలు, ఓటీటీ ప్రాజెక్ట్స్ వైపే సాగుతోంది. ఏదయితేనేం.. తాను ఆశించిన సక్సెస్ అందులోనే దొరుకుతోంది అంటోంది ఆ నటి.
గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా
మొదట పెద్ద గుర్తింపు వచ్చిన సినిమా ‘మార్గరిటా విత్ ఎ స్ట్రా’. ఈ సినిమాలో చేసిన పాత్ర ద్వారా ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇది ఆమె కెరీర్‌కు ఒక మలుపుగా కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అవకాశాలు కూడా కొద్దికొద్దిగా పెరిగాయి. ‘ఫ్యాన్’ సినిమాలో చిన్న పాత్ర చేసినా, అది పెద్ద ప్రాజెక్ట్‌లో కావడంతో మంచి గుర్తింపు వచ్చింది. జాలీ ఎల్ఎల్బీ-2, ఆర్టికల్ 15 వంటి సినిమాల్లో ఆమె చేసిన పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో కూడా నటించింది సయానీ. ముఖ్యంగా ‘ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్’ అనే సిరీస్‌లో ఆమె చేసిన పాత్ర చాలా పాపులర్ అయింది. దీంతో డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చాయి.
స్క్రీన్ యాక్టింగ్
పుణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్ తీసుకుంది. అక్కడ ఆమె స్క్రీన్ యాక్టింగ్, కెమెరా ముందు ఎలా ఉండాలి? పాత్రలో ఒదిగిపోవడం వంటి అంశాలు లోతుగా అర్థం చేసుకుంది. ఈ శిక్షణనే ఆమె యాక్టింగ్ కెరీర్‌కు బలమైన పునాది వేసింది. అదే ఆమెను ఇండస్ట్రీలో నిలబడేలా మంచి నటిగా తయారుచేసింది.
