- మిడిలార్డర్, ఫీల్డింగ్ లోపాలపై దృష్టి
- రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్
మాంచెస్టర్: విమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా కీలక పోరుకు రెడీ అయ్యింది. సెమీస్‌కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో గురువారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది. గత మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత మిడిలార్డర్ వైఫల్యాలు, ఫీల్డింగ్ లోపాలపైనే ప్రధానంగా దృష్టి సారించనుంది. టోర్నీ ఆరంభంలో టాప్ ఆర్డర్ ఫామ్‌పై ఆందోళన కనిపించింది.
కానీ స్మృతి, షెఫాలీ వాటిని పటాపంచలు చేశారు. మంధాన మూడు మ్యాచ్‌ల్లో 159 రన్స్ చేయగా, షెఫాలీ 92 రన్స్ సాధించింది. వీరిద్దరూ 154కు పైగా స్ట్రైక్ రేట్‌తో జట్టుకు మంచి ఆరంభాలు ఇస్తున్నారు. అయితే ఓపెనర్లు ఇస్తున్న బలమై న ఆరంభాన్ని మిడిలార్డర్ బ్యాటర్లు ఉపయోగించుకోలేకపోతున్నారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, యాస్తికా భాటియా వేగంగా ఆడటంలో విఫలమవుతున్నారు.
ఆఖర్లో రిచా ఘోష్, దీప్తి శర్మ వేగంగా ఆడుతున్నప్పటికీ.. ఎక్కువ రన్‌రేట్‌తో ఒత్తిడికి లోనవుతున్నారు. సౌతాఫ్రికా ప్లేయర్ మరిజానె కాప్ ఇచ్చిన రెండు సులువైన క్యాచ్‌లను రాధా యాదవ్ జారవిడచడం ఓటమికి కారణంగా మారింది.
శ్రీచరణి ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పినప్పటికీ, మిగతా బౌలర్ల వైఫల్యం, పేలవ ఫీల్డింగ్ వల్ల ఇండియా మూల్యం చెల్లించుకుంది. మరోవైపు రెండు వరుస విజయాలతో బంగ్లాదేశ్ మంచి జోరుమీదుంది. బ్యాటర్లందరూ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. బౌలర్లు సమయానుకూలంగా రాణిస్తున్నారు. కాబట్టి బంగ్లాతో అప్రమత్తంగా లేకపోతే ఇండియాకు ఓటమి తప్పదు.
