వైభవ్‌‌కు ప్రత్యేక ఛేంజింగ్‌‌ రూమ్‌‌ !

వైభవ్‌‌కు ప్రత్యేక ఛేంజింగ్‌‌ రూమ్‌‌ !

న్యూఢిల్లీ: టీమిండియా వండర్‌‌ కిడ్‌‌ వైభవ్‌‌ సూర్యవంశీ.. తొలి ఇంటర్నేషనల్‌‌ టూర్‌‌లో సరికొత్త అనుభవాన్ని ఎదుర్కోనున్నాడు. రాబోయే ఇంగ్లండ్‌‌ సిరీస్‌‌లో 15 ఏళ్ల వైభవ్‌‌కు ప్రత్యేక ఛేంజింగ్‌‌ రూమ్‌‌ (దుస్తులు మార్చుకునే గది) కేటాయించనున్నారు. లండన్‌‌ భద్రతా నిబంధనల ప్రకారం ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ టూర్‌‌లో టీమిండియా.. ఐర్లాండ్‌‌తో రెండు, ఇంగ్లండ్‌‌తో ఐదు టీ20లు ఆడనుంది. అయితే ఐసీసీ, ఇంగ్లండ్‌‌ క్రికెట్‌‌ బోర్డు (ఈసీబీ) భద్రతా నిబంధనల ప్రకారం 16 ఏళ్ల లోపు ఉన్న ప్లేయర్లు పెద్దల ఛేంజింగ్‌‌ రూమ్‌‌లను ఉపయోగించుకోకూడదు. అయితే మ్యాచ్‌‌ జరుగుతున్న టైమ్‌‌లో వైభవ్‌‌ టీమిండియా డ్రెస్సింగ్‌‌ రూమ్‌‌లోనే ఉంటాడు.

జట్టు సమావేశాల్లో పాల్గొంటాడు. కానీ మ్యాచ్‌‌కు ముందు, దుస్తులు మార్చుకునే టైమ్‌‌లో మాత్రమే ఈ ఆంక్షలు వర్తిస్తాయి. గత సీజన్‌‌లో ఆర్సెనల్‌‌ క్లబ్‌‌ ప్లేయర్‌‌ మాక్స్‌‌ డౌమాన్‌‌కు కూడా 16 ఏళ్లు నిండకపోవడంతో ప్రత్యేక గదిని కేటాయించారు. ఈ టూర్‌‌లో వైభవ్‌‌ తల్లిదండ్రులు కూడా అతడితో పాటే వెళ్లనున్నారు. 

ఐర్లాండ్‌‌తో మ్యాచ్‌‌లో బరిలోకి దిగితే టీమిండియా తరఫున ఇంటర్నేషనల్‌‌ క్రికెట్‌‌ ఆడనున్న అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టిస్తాడు. 1989లో 16 ఏళ్ల 205 రోజుల వయసులో టెస్ట్ అరంగేట్రం చేసిన లెజెండ్‌‌ బ్యాటర్‌‌ సచిన్ టెండూల్కర్ రికార్డును వైభవ్ అధిగమిస్తాడు. ఈ టూర్‌‌ కోసం వైభవ్‌‌కు మూడో నంబర్‌‌ జెర్సీని కేటాయించారు.