జనగామ, వెలుగు: సంపులో పడి చిన్నారి చనిపోగా.. ఆమె మృతి తట్టుకోలేక ఏడుస్తూ నానమ్మ గుండెపోటుతో చనిపోయింది. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రంలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... పట్టణంలోని సంజయ్ నగర్ లో సుద్దపెల్లి రఘువంశీ, భవాని దంపతులు నివసిస్తున్నారు.
బుధవారం ఉదయం భవాని నిద్రలేచిన అనంతరం ఇంటి పనుల్లో నిమగ్నమైంది. ఇదే సమయంలో నిద్రలేచిన వారి ఏడాదిన్నర కూతురు ప్రియాన్షి ఆడుకుంటూ బయటకు వెళ్లింది. భవాని ఇంటి పనులు ముగించుకొని కూతురు ప్రియాన్షి కోసం వెతకగా ఎక్కడా కనిపించలేదు.
చుట్టుపక్కల గాలించగా... ఇంటి ముందున్న సంపులో చిన్నారి కనిపించింది. భవాని కేకలు వేయడంతో రఘువంశీ వచ్చి సంపులోంచి ప్రియాన్షిని బయటకు తీసి స్థానిక ఎంసీహెచ్‌కు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చిన్నారి చనిపోయిందని చెప్పారు.
ప్రియాన్షి డెడ్‌బాడీని ఇంటికి తీసుకొని రావడంతో చిన్నారి నానమ్మ నాగమ్మ (65) పెద్ద పెట్టున రోదించింది. ఈ క్రమంలోనే గుండెపోటు రావడంతో నాగమ్మ అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయింది.
