హైదరాబాద్, వెలుగు: వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామానికి చెందిన ల్యాదెల్ల రాజు మృతి కేసులో రీ పోస్ట్‌మార్టం నిర్వహించే అవకాశం ఉందో లేదో చెప్పాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై పోలీసు అధికారుల నుంచి వివరాలు సేకరించాలంది. దర్యాప్తు తీరుపై పిటిషనర్ చేసిన ఆరోపణలపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని నోటీసులిచ్చింది. విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.
తన భర్త ల్యాదెల్ల రాజు మృతి కేసులో పోలీసులు నిష్పాక్షపాతంగా దర్యాప్తు నిర్వహించలేదని ఆరోపిస్తూ ఆయన భార్య ల్యాదెల్ల ప్రియాంక హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ టి. మాధవీదేవి బుధవారం విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మృతదేహంపై గాయాలున్నప్పటికీ వాటి గురించి ప్రస్తావించకుండా ఫోరెన్సిక్ నివేదికలో మరణానికి గుండెపోటే కారణమని పేర్కొన్నారని తెలిపారు. దీంతో రీ పోస్ట్‌మార్టం నిర్వహణ సాధ్యాసాధ్యాలపై పోలీసు అధికారుల నుంచి స్పష్టమైన సూచనలు తీసుకురావాలని ప్రభుత్వ న్యాయవాదిని జస్టిస్ ఆదేశించారు.
