- రూ.17.48 కోట్లతో రహదారి పనులకు శంకుస్థాపనలు
మధిర, వెలుగు: మధిర నియోజకవర్గ రూపురేఖలను మార్చడమే లక్ష్యంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభివృద్ధి పనులు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో బుధవారం పర్యటించిన ఆయన సుమారు రూ.17.48 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. రూ.3.20 కోట్లతో చిరునోముల–వత్సవాయి రహదారి, రూ.5.50 కోట్లతో ముష్టికుంట్ల–గార్లపాడు రోడ్డు పనులను ప్రారంభించారు.
అలాగే ముష్టికుంట్ల ఎస్సీ కాలనీలో రూ.73 లక్షలతో అంతర్గత రహదారుల నిర్మాణానికి, బోనకల్ ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి చిరునోముల వరకు రూ.3.30 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి, ముష్టికుంట్ల–నాగులవంచ–చొప్పకట్లపాలెం మార్గంలో రూ.4.75 కోట్లతో చేపట్టనున్న పనులకు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్, అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
