చావు నోట్లో తలపెట్టారు.. మింగేయకుండా ఉంటుందా.. ఈ బుడ్డోడికి భూమ్మీద నూకలున్నయ్ !

చావు నోట్లో తలపెట్టారు.. మింగేయకుండా ఉంటుందా.. ఈ బుడ్డోడికి భూమ్మీద నూకలున్నయ్ !

బెంగళూరు: కర్ణాటకలో విషాద ఘటన జరిగింది. కావేరి నదిలో మునిగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన పెను విషాదం నింపింది. ఈ ఐదుగురిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వాళ్లే కావడం గమనార్హం.

మంగళవారం సాయంత్రం మాండ్య జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశమైన ముత్తాతి దగ్గర ఆలయ సందర్శనకు ఐదుగురు యాత్రికులు వెళ్లారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం కబ్బలమ్మ ఆలయాన్ని సందర్శించి, ఆ తర్వాత ముత్తాతిలోని ముత్తాతిరాయ ఆలయానికి వెళ్లారు.

దైవ దర్శనం అనంతరం.. సమీపంలోని కావేరీ నది దగ్గరకు వెళ్లారు. సరదాగా నదిలోకి దిగారు. సాయంత్రం 4:45 నుంచి 5 గంటల మధ్య సమయంలో ప్రమాదవశాత్తూ నదిలో మునిగిపోయారు. విజయమ్మ అనే మహిళ ప్రమాదవశాత్తు నదిలోని లోతైన భాగంలోకి జారిపడి మునిగిపోయింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో.. మిగిలిన వాళ్లు కూడా ఒకరి తర్వాత ఒకరు నీళ్లలోకి దిగారు. కానీ నీటి ఉధృతికి కొట్టుకుపోయారు. చనిపోయిన వారిని శ్వేత (38), చైత్ర (20), విజయమ్మ (50), ప్రియాంక (28), డ్రైవర్ మహేష్‌గా పోలీసులు గుర్తించారు.

నీళ్లు లోతు తక్కువగా ఉందని భావించి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మహిళలు ఫోటోలు తీసుకోవడం కోసం నదిలోకి దిగారు. ఆ ప్రాంతంలో ఉన్న హోం గార్డులు హెచ్చరించినప్పటికీ వినకుండా నదిలోకి వెళ్లారు. ఈ క్రమంలోనే ఈ విషాదం జరిగింది. వారిని రక్షించడానికి ప్రయత్నించిన కుటుంబ సభ్యుడైన రవిని స్థానికులు బయటకు లాగడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. నాలుగేళ్ల చిన్నారి కూడా వాళ్లకు దూరంగా కూర్చుని ఉండటంతో ప్రాణాలు దక్కాయి. నది నుంచి ఐదు మృతదేహాలను వెలికితీసి.. పోస్ట్‌మార్టం నిమిత్తం మాండ్యా మిమ్స్ ఆసుపత్రికి తరలించారు.