FIFA Suspends Nepal Football Team: నేపాల్ ఫుట్‌బాల్ రంగానికి అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (FIFA) కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఆల్ నేపాల్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (ANFA) పై ఫిఫా తక్షణమే అమల్లోకి వచ్చేలా సస్పెన్షన్ విధించింది. అసోసియేషన్ వ్యవహారాల్లో థర్డ్ పార్టీ జోక్యం చేసుకోవడం, ఫిఫా నిబంధనలను (FIFA Statutes) ఘోరంగా ఉల్లంఘించడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. కాగా నేపాల్ ఫుట్‌బాల్ గవర్నెన్స్‌పై గత కొంతకాలంగా సాగుతున్న వివాదం చివరకు ఈ తీవ్ర పరిణామాలకి దారి తీసింది. గతంలో నేపాల్ నేషనల్ స్పోర్ట్స్ కౌన్సిల్ అన్ఫా (ANFA) పై 3 నెలల పాటు సస్పెన్షన్ విధించి, ఆ తర్వాత దాన్ని ఉపసంహరించుకుంది. అయితే ఈ అంతర్గత గొడవలను సిరీయస్ గా తీసుకున్న ఫిఫా కౌన్సిల్ బ్యూరో నేపాల్‌పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.
నేపాల్ ఫుట్‌బాల్‌కు అంతర్జాతీయ డోర్స్ క్లోజ్:
ఫిఫా సర్క్యులర్ ప్రకారం, జూన్ 24, 2026 నుంచి అమల్లోకి వచ్చిన ఈ సస్పెన్షన్ వల్ల నేపాల్ ఫుట్‌బాల్ అసోసియేషన్ తన సభ్యత్వ హక్కులన్నింటినీ కోల్పోయింది. ఈ సస్పెన్షన్ ఎత్తివేసే వరకు నేపాల్ జాతీయ ఫుట్‌బాల్ జట్లు (పురుషుల, మహిళల టీమ్స్) అక్కడి లోకల్ క్లబ్‌లు.. ఫిఫా (FIFA) లేదా ఏషియన్ ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ (AFC) నిర్వహించే ఎలాంటి అంతర్జాతీయ పోటీల్లోనూ పాల్గొనడానికి వీల్లేదు. అన్ఫా (ANFA), దాని అనుబంధ సంస్థలు, అధికారులు ఫిఫా, ఏఎఫ్‌సీల నుంచి అందే ఎలాంటి డెవలప్‌మెంట్ ఫండ్‌లను (Funding) పొందే అర్హతను కోల్పోతారు. ఫిఫా, ఏఎఫ్‌సీ నిర్వహించే ఎలాంటి డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లు, కోర్సులు లేదా ట్రైనింగ్ సెషన్ల నుంచి నేపాల్ అధికారులు గానీ, ప్లేయర్లు గానీ ప్రయోజనం పొందలేరు.
ఇతర దేశాలకు ఫిఫా హెచ్చరిక:
సస్పెన్షన్ కాలంలో నేపాల్ అసోసియేషన్‌తో లేదా వారి జట్లతో ఎలాంటి క్రీడాపరమైన సంబంధాలు (Sporting contact), అంటే ఫ్రెండ్లీ మ్యాచ్‌లు వంటివి పెట్టుకోవద్దని ఫిఫా తన మిగిలిన సభ్య దేశాలను, దాని అనుబంధ సంస్థలను గట్టిగా హెచ్చరించింది. ఫిఫా నిబంధనలలోని ఆర్టికల్ 14 ప్రకారం.. అసోసియేషన్ బాధ్యతలలో ఏవైనా ఉల్లంఘనలు జరిగితే కఠినమైన చర్యలు ఉంటాయి. ఈ థర్డ్ పార్టీ జోక్యం అనేది సదరు ఫుట్‌బాల్ అసోసియేషన్ తప్పు వల్ల జరగకపోయినప్పటికీ.. శిక్ష మాత్రం తప్పదు.. తమ సంస్థలోని సభ్యుల నిర్లక్ష్యం లేదా ఉద్దేశపూర్వక తప్పుల వల్ల జరిగే ప్రతి చర్యకు ఆయా దేశాల అసోసియేషన్లదే పూర్తి బాధ్యత అని పేర్కొంటుంది.
