MCX మార్కెట్లో బంగారం పతనం.. జస్ట్ 3 రోజుల్లో రూ.7వేల 500 తగ్గిన గోల్డ్.. ఇంకా తగ్గబోతోందా?

MCX మార్కెట్లో బంగారం పతనం.. జస్ట్ 3 రోజుల్లో రూ.7వేల 500 తగ్గిన గోల్డ్.. ఇంకా తగ్గబోతోందా?

గోల్డ్ లవర్స్, ఇన్వెస్టర్లకు మైండ్ బ్లాక్ అయ్యే షాక్. కొన్ని నెలలుగా కొండెక్కి కూర్చున్న బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా డమాల్ అంటూ కిందపడ్డాయి. దలాల్ స్ట్రీట్ నుంచి నగల దుకాణాల దాకా ఇప్పుడు ఒకటే చర్చ.. బంగారం ధరలకు ఏమైంది? అని. గత మూడు రోజులుగా స్పాట్ మార్కెట్లో గోల్డ్, వెండి వెనక్కి తగ్గుతున్నాయి. కేవలం మూడు రోజుల్లోనే బంగారం ధర ఏకంగా రూ.7వేల 482 మేర దిగొచ్చింది.

మార్కెట్లో తాజా పరిస్థితి ఇదీ..
మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్(MCX)లో గురువారం నాడు 10 గ్రాముల బంగారం ధర రూ.1,478 తగ్గి రూ. లక్షా 40వేల 700 కి చేరుకుంది. ఇక వెండి పరిస్థితి అయితే మరీ ఘోరం. కిలో వెండి ధర గురువారం ఒక్కరోజే రూ.11వేల 298 పతనమై రూ.2లక్షల 10వేల 737 వద్ద ముగిసింది. మూడు రోజుల్లోనే వెండి ఏకంగా రూ.21వేల 728 మేర చౌకగా మారింది.

నిజానికి ఈ ఏడాది జనవరి 29న బంగారం రూ.లక్షా 93వేల 096 వద్ద ఆల్‌టైమ్ హై రికార్డును తాకింది. అప్పటితో పోలిస్తే ఇప్పటివరకు తులం బంగారంపై రూ.52వేల 396 తగ్గింది. అలాగే రూ.4లక్షల 20వేల 048 గరిష్ట మార్కును చూసిన కేజీ వెండి.. ఇప్పుడు ఏకంగా రూ.2లక్షల 09వేల 311 తగ్గి సగానికి సగం ధరకు లభిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర ఔన్స్‌కు 3.8% తగ్గి 3,960 డాలర్లకి పడిపోగా, వెండి 60 డాలర్ల దిగువకు చేరింది.

గోల్డ్, సిల్వర్ రేట్ల పతనానికి 5 ముఖ్య కారణాలు:

* బలపడిన డాలర్: అంతర్జాతీయ మార్కెట్లో ఈ వారం యూఎస్ డాలర్ విలువ 1% పెరిగింది. డాలర్ బలోపేతం కావడంతో ఇతర కరెన్సీల వారికి బంగారం కొనడం భారంగా మారింది.
* ఫెడ్ కఠిన నిర్ణయాలు: యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ కెవిన్ వార్ష్ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి వడ్డీ రేట్లను మరింత పెంచే సంకేతాలు ఇవ్వడంతో డాలర్ పుంజుకుంది.
* యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతలు: ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం వల్ల ఇంధన ధరలు పెరిగాయి. ఇది వడ్డీ రేట్ల పెంపునకు దారితీయడంతో, ఇన్వెస్టర్లు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అయిన ట్రెజరీ బాండ్ల వైపు మొగ్గు చూపుతున్నారు.
* బ్యాంకుల అంచనాల తగ్గింపు: అంతర్జాతీయ దిగ్గజ బ్యాంకులు బంగారం భవిష్యత్ ధరల అంచనాలను తగ్గించాయి. గోల్డ్‌మన్ శాక్స్ తన అంచనాలో ఏకంగా 500 డాలర్లు ఔన్సుకు కోత పెట్టింది. డాయిష్ బ్యాంక్ కూడా నాల్గవ త్రైమాసిక ధరల అంచనాను 17% తగ్గించింది.
* ఈటీఎఫ్ విక్రయాలు: గోల్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు నిరంతరం పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. చైనా మార్కెట్లో కూడా డిమాండ్ తగ్గడం దీనికి మరింత ఆజ్యం పోసింది.

మెుత్తానికి గడచిన మూడేళ్లలో డబుల్ డిజిట్ రిటర్న్స్‌తో దూసుకుపోయిన గోల్డ్ ప్రస్థానానికి ప్రస్తుతానికి బ్రేక్ పడినట్లే కనిపిస్తోంది. జనవరిలో 5,600 డాలర్ల గరిష్టాన్ని చూసిన బంగారం, జూన్ నాటికి 20 శాతం పైగా క్షీణించింది. ధరలు తగ్గుతుండటంతో సామాన్యులు సంతోషం వ్యక్తం చేస్తుంటే.. ఇన్వెస్టర్లు మాత్రం ఆందోళనలో పడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రేట్ల పతనం మరికొంత కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.