ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారి భారీ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కొరటాల శివ డైరెక్షన్ లో బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం వెలగపూడిలోని బిట్స్ పిలానీ గ్రౌండ్ లో జరిగింది. గురువారం ( జూన్ 25 ) జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమం అనంతరం క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు మంత్రి లోకేష్. బాలకృష్ణ కూతురు తేజస్వి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. సినిమా ప్రారంభోత్సవానికి ఎప్పుడూ వెళ్లలేదని... ఈ అద్భుత అవకాశం ఇచ్చిన ముద్దుల మావయ్య జై బాలయ్యకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. బాలకృష్ణ నాయకత్వంలో సినీ పరిశ్రమను అమరావతిలో పెద్దఎత్తున ప్రోత్సహించే లక్ష్యంతో పని చేస్తున్నామని అన్నారు లోకేష్.
సినిమాతో పాటు క్రియేటర్ ఎకానమీని కూడా ప్రోత్సహించాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన అని అన్నారు. ఇందుకు కలవాల్సిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు లోకేష్. అమరావతి పవిత్ర భూమి అని .. భవిష్యత్తులో మరిన్ని సినిమాలు ఇక్కడ ప్రారంభించాలని కోరుకుంటున్నాని అన్నారు లోకేష్.
