స్టాక్ మార్కెట్లో చాలా కాలం తర్వాత మళ్లీ ఐపీఓల హవా కొనసాగుతోంది. గురువారం రోజున 'ఏవియన్స్ బయోమెడికల్స్' కంపెనీ షేర్లు దలాల్ స్ట్రీట్‌లో సరికొత్త రికార్డు సృష్టించాయి. మార్కెట్లోకి అడుగుపెట్టిన మొదటి రోజే ఈ కంపెనీ ఇన్వెస్టర్ల సొమ్మును రెట్టింపు చేసి కాసుల వర్షం కురిపించింది. దీంతో ఐపీఓపై బెట్ వేసి షేర్లు అలాట్ అయిన ఇన్వెస్టర్లు పండగ చేసుకుంటున్నారు.
తొలిరోజే 100% జంప్
ఏవియన్స్ బయోమెడికల్స్ ఐపీఓ ఇష్యూ ధరను కంపెనీ రూ.208 గా నిర్ణయించగా.. గురువారం నాటి ట్రేడింగ్‌లో ఏకంగా 90 శాతం లాభంతో రూ.395.20 వద్ద లిస్టయింది. అక్కడితో ఆగకుండా.. ఆ తర్వాత కొద్ది సేపట్లోనే మరో 5 శాతం పెరిగి రూ.414.95 మార్కును తాకింది. అంటే ఐపీఓ ధరతో పోలిస్తే తొలిరోజే దాదాపు 100 శాతం లాభాన్ని అందించి ఇన్వెస్టర్లను సంతోషంలో ముంచెత్తింది.
385 రెట్లు సబ్‌స్క్రిప్షన్.. బంపర్ రెస్పాన్స్
ఈ ఐపీఓకు మార్కెట్లో ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. మొత్తం మీద ఈ ఐపీఓ 385.32 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది.
* రిటైల్ ఇన్వెస్టర్ల కేటగిరీ: 401.36 రెట్లు
* నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కేటగిరీ: 597.23 రెట్లు
* క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ వాటా: 196.77 రెట్లు
ఈ ఐపీఓలో సాధారణ ఇన్వెస్టర్లు గరిష్టంగా 2 లాట్లు బిడ్ వేసేందుకు అవకాశం లభించింది. ఇందుకోసం వారు రూ.2లక్షల 49వేల 600 పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. జూన్ 18న ప్రారంభమైన ఈ రూ.30 కోట్ల ఐపీఓ విండో జూన్ 22తో ముగిసింది. జూన్ 23న షేర్ల అలాట్‌మెంట్ పూర్తయింది. ఈ ఐపీఓ తర్వాత కంపెనీ ప్రమోటర్లు ధరమ్ దేవ్ చౌదరి, రామ్ నగీనా చౌదరి, జనార్దన్ పాల్, దీపా చౌదరి వాటా 87.89% నుండి 64.59% కి తగ్గింది. ఐపీఓ ద్వారా వచ్చిన నిధులను కంపెనీ నోయిడాలో కొత్త మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు ఉపయోగించాలని నిర్ణయించింది.
కంపెనీ ఏం బిజినెస్ చేస్తుంది?
జూన్ 2024లో ప్రారంభమైన ఏవియన్స్ బయోమెడికల్స్ ఒక ఐఎస్ఓ గుర్తింపు పొందిన సంస్థ. ఈ కంపెనీ ప్రధానంగా మాలిక్యులర్ డయాగ్నోస్టిక్ సొల్యూషన్స్ తయారీ, సరఫరా, ఎగుమతిలో ప్రత్యేకత కలిగి ఉంది. బయోటెక్నాలజీ, జెనోమిక్స్, ఐవీడీ పరిశ్రమలపై ఇది దృష్టి సారించింది. వీటితో పాటు మెడికల్ ఎక్విప్‌మెంట్ డిస్ట్రిబ్యూటర్స్‌గా, ట్రేడర్స్‌గానూ కొనసాగుతోంది. ఈ కంపెనీ ఉత్పత్తులు పాథాలజీ ల్యాబ్‌లు, మైక్రోబయాలజీ ల్యాబ్‌లు, ఆసుపత్రులు, పరిశోధనా కేంద్రాల అవసరాలను తీరుస్తాయి. ఈ సంస్థకు ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో అత్యాధునిక తయారీ యూనిట్ ఉంది.
