సమీప బడా? సమగ్ర బడా? తెలంగాణ పబ్లిక్ స్కూల్ నాణ్యమైన విద్యకు ప్రతిరూపమా..!

సమీప బడా? సమగ్ర బడా?  తెలంగాణ పబ్లిక్ స్కూల్ నాణ్యమైన విద్యకు ప్రతిరూపమా..!

ప్రతి గ్రామానికి ఒక బడి ‘విద్యా హక్కు భావనకు ప్రతీక అయితే..  అన్ని వసతులతో కూడిన  ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’(ఉమ్మడి బడి) నాణ్యమైన విద్యకు ప్రతిరూపమనే చర్చ జరుగుతోంది. విద్యాహక్కు చట్టం- 2009 ప్రకారం ప్రతి చిన్నారికి తన నివాసానికి సమీపంలో నాణ్యమైన విద్య అందుబాటులో ఉండాలి. ఈ ఉద్దేశంతో  దేశవ్యాప్తంగా గ్రామాల్లో ప్రాథమిక  పాఠశాలలు నెలకొల్పారు.  

తెలంగాణలో  కూడా దశాబ్దాలుగా  ‘ఊరికొక్క బడి’ అనే భావనతో ప్రభుత్వ విద్య విస్తరించింది.  అయితే  మారుతున్న సామాజిక,  ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో  ప్రభుత్వ  పాఠశాలల  నమూనా  సవాళ్లను ఎదుర్కొంటోంది.  ఆధునిక  సౌకర్యాలతో  ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ముందుకు దూసుకెళ్తుండగా,  ప్రభుత్వ బడులు వెనుకబడుతున్నాయి.  ఫలితంగా తల్లిదండ్రులు  ప్రైవేట్ విద్యవైపు  మొగ్గుచూపుతున్నారు. ఇది విద్యలో అసమానతలను పెంచుతూ ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.

ప్రభుత్వ బడుల్లో తగ్గుతున్న చేరికలు?

గ్రామీణ ప్రాంతాల్లో  ప్రభుత్వ పాఠశాలలు ఉన్నప్పటికీ  అనేకచోట్ల విద్యార్థుల  నమోదు క్రమంగా తగ్గుతోంది.  ప్రతి ఏటా  బడిబాట కార్యక్రమం  నిర్వహించినప్పటికీ ఆశించిన స్థాయిలో చేరికలు జరగడం లేదు.  కొన్ని పాఠశాలలు విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి.  కేంద్ర ప్రభుత్వ  గణాంకాల ప్రకారం 2022–23లో  28.8 లక్షలుగా ఉన్న విద్యార్థుల నమోదు,  2024–25 నాటికి 25.13 లక్షలకు పడిపోయింది. 

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు.  మౌలిక వసతులు లేమి, ఉపాధ్యాయుల కొరత, ఏకోపాధ్యాయ పాఠశాలలు,  ఇంగ్లిష్  మాధ్యమంపై  పెరిగిన  ఆకర్షణ,  ప్రైవేట్ పాఠశాలల ప్రచారం వంటి అంశాలు ప్రభుత్వ బడులపై చిన్నచూపు ఏర్పడుతోంది.  నాణ్యమైన  ఇంగ్గిష్ విద్య,  ప్రయోగశాలలు, కంప్యూటర్లు, డిజిటల్ తరగతులు లేకపోవడం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. 

ఫలితంగా  ‘బడి ఉంది, కానీ నాణ్యమైన విద్య ఉందా?’ అనే ప్రశ్న తల్లిదండ్రుల్లో  తలెత్తుతోంది.  అంతిమంగా ప్రభుత్వ పాఠశాలలు అత్యవసర స్థితిని ఎదుర్కొంటున్నాయి.  సంస్థాగత లోపాలు,  వ్యవస్థాగతంగా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ఇందుకు ప్రధాన కారణం.  మరోవైపు ఇప్పటికీ ఆధునిక పోటీని తట్టుకుని ముందుకువెళ్లే  ప్రభుత్వ బడులకు డిమాండ్ తగ్గలేదు. ఆ పాఠశాలలో  పిల్లలను చేర్పించేందుకు  తల్లిదండ్రులు వరుస కడుతున్నారు.  కార్పొరేట్​ స్థాయి వసతులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, సమాజ భాగస్వామ్యమే ఇందుకు కారణం.  ఇటీవల ప్రభుత్వ విద్యావ్యవస్థలో నిబద్ధత, అంకితభావం గల ఉపాధ్యాయులు కీలకంగా మారారు. అలాంటి ఉపాధ్యాయుడు ఉన్నచోట  కనీస  సౌకర్యాలు లేకపోయినా, ఆ పాఠశాలలు విజయవంతంగా  ముందుకు సాగుతున్నాయి.  

తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆలోచన 

నేడు బడి ఉండటం ముఖ్యం కాదు,  నాణ్యమైన,  గౌరవప్రదమైన విద్యనందించే పాఠశాల ముఖ్యమనే చర్చ ప్రధానంగా నడుస్తున్నది.  అలాంటి పాఠశాల విద్యవైపు తల్లిదండ్రులు కూడా మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ భావనను  ముందుకు తీసుకువచ్చింది.  కొన్ని గ్రామాలను ఒక క్లస్టర్‌‌‌‌‌‌‌‌గా తీసుకొని ఒకే పాఠశాలలో అత్యాధునిక సౌకర్యాలు, పూర్తిస్థాయి ఉపాధ్యాయులు, డిజిటల్ తరగతులు, సైన్స్ ల్యాబ్‌‌‌‌‌‌‌‌లు,  క్రీడా వసతులు, ఇంగ్లిష్  మాధ్యమ బోధన వంటి సదుపాయాలు కల్పించనున్నారు.


  ఒకే ప్రాంగణంలో  ప్రీ -ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు తరగతులు ఉంటాయి. ఈ విధానంలో  బడులు మార్చకుండా ఒకే ప్రాంగణంలో  నాణ్యమైన  విద్యనందించడం బాలల భవిష్యత్తుకు  మేలు చేస్తుంది.  విద్యార్థుల్లో పోటీతత్వం,  సామాజిక నైపుణ్యాలు పెరుగుతాయి.  ప్రభుత్వ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు. ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ విద్య,  నైపుణ్యాభివృద్ధి  కార్యక్రమాలను  మెరుగ్గా అమలు చేయవచ్చు.  ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్య అందించే అవకాశం ఉంటుంది.    డ్రాపౌట్స్ కూడా తగ్గుతాయి.  మరోవైపు  రాష్ట్రవ్యాప్తంగా 2,769 ప్రభుత్వ పాఠశాలల్లో  ప్రీ-ప్రైమరీ తరగతులను సైతం ప్రారంభించారు.   ఊరికొక బడి ఉండడం వలన విద్య అందరికీ అందుబాటులో ఉంటుంది. 

నాణ్యమైన పాఠశాలే ముఖ్యం

 గ్రామంలో బడి ఉండి ఉపాధ్యాయులు, సౌకర్యాలు లేకపోతే ఆ పాఠశాల ఉనికి ప్రశ్నార్ధకమే.  అదేవిధంగా ఉమ్మడి పాఠశాల ఏర్పాటు చేసి రవాణా,  భద్రత, అందుబాటు వంటి అంశాలను నిర్లక్ష్యం చేస్తే కూడా అది విజయవంతం కాదు. ఈ నేపథ్యంలో సమతుల్య మార్గం అవసరం అని విద్యా విశ్లేషకుల భావన.  ప్రతి గ్రామంలో ప్రాథమిక పాఠశాల కొనసాగించడం,  ఉన్నత  తరగతుల కోసం  క్లస్టర్  ఆధారిత  పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయడం ఒక సమతుల్య  పరిష్కారంగా కనిపిస్తోంది. ఈ

 విధానానికి విద్యాహక్కు చట్టం అడ్డంకులు  ఎదురుకావు. అలాగే విద్యార్థులకు రవాణా, నాణ్యమైన భోజనం, ఉపాధ్యాయ నియామకాలు, డిజిటల్ వనరులను సమర్థంగా అమలుచేయాలి.  స్వతంత్ర మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. . అప్పుడే ఊరుకొక బడి బతుకుతుంది,  ఉమ్మడి (తెలంగాణ పబ్లిక్ స్కూల్) పాఠశాలలు విజయవంతం అవుతాయి.

- సంపతి రమేష్ , సోషల్ ​ఎనలిస్ట్​-