తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. టీవీకే అధినేత విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని ఇండోర్ స్టేడియం అభిమానుల నినాదాలతో మార్మోగిపోతుండగా.. వేదికపై ఒక ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ విజయ్ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. అయితే ప్రమాణం చేసే సమయంలో విజయ్ తనదైన సినిమా శైలిలో.. కొంత ఆవేదనను, భావోద్వేగాన్ని జోడిస్తూ డైలాగ్ మాదిరిగా చెప్పడం ప్రారంభించారు. అది చూసి గవర్నర్ ఒక్కసారిగా అభ్యంతరం వ్యక్తం చేశారు.
విజయ్ శైలిపై అసహనానికి గురైన గవర్నర్.. మధ్యలోనే జోక్యం చేసుకున్నారు. రాజ్యాంగబద్ధమైన ప్రమాణ స్వీకారం నిబంధనల ప్రకారం, గౌరవప్రదంగా సాగాలని విజయ్‌కు సూచించారు. ఇది ఒక అధికారిక ప్రక్రియ.. సాధారణంగా ప్రమాణం చేయండి అని గవర్నర్ చెప్పడంతో స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది.
గవర్నర్ సూచనతో వెంటనే సర్దుకున్న విజయ్.. తన భావోద్వేగాన్ని పక్కన పెట్టి, అత్యంత సాధారణంగా తిరిగి ప్రమాణ స్వీకారాన్ని పూర్తి చేశారు. దళపతి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆనందంలో ఉన్న అభిమానులకు, ఈ చిన్నపాటి గొడవ షాకింగ్‌గా అనిపించింది. ప్రస్తుతం గవర్నర్ అభ్యంతరం తెలపడం, విజయ్ మళ్లీ ప్రమాణం చేయడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
విజయ్ తోపాటు 9మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త మంత్రుల చేత గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అక్లేకర్ ప్రమాణం చేయించారు. మంత్రులలో టీవీకే పార్టీ సీనియర్ నేతలు ఆధవ్ అర్జునా,కె.ఎ. సెంగోట్టియన్ లు ఉన్నారు.
