ఎండాకాలంలో మీ శరీరం ఏసీలా మారాల.. ఈ 10 అద్భుతమైన ఆహారాలను అస్సలు వదలకండి!

ఎండాకాలంలో మీ శరీరం ఏసీలా మారాల.. ఈ 10 అద్భుతమైన ఆహారాలను అస్సలు వదలకండి!

ఎండాకాలంలో ఎండలు మండిపోతుంటాయి. దీనివల్ల మన శరీరం త్వరగా అలసిపోతుంది, నీరసం వస్తుంది. ఈ వేడిని తక్కువగా అంచనా వేస్తే అది మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా డీహైడ్రేషన్ వల్ల శక్తి కోల్పోయినట్లు అనిపిస్తుంది. సరైన ఆహార అలవాట్లు, లైఫ్ స్టయిల్ మార్పుల ద్వారా ఈ వేసవి తాపం నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

శరీర వేడి పెరగడానికి కారణాలు ఏంటి 
శరీర ఉష్ణోగ్రత పెరగడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఎండలో తిరగడం, అధిక వ్యాయామం చేసినపుడు కూడా శరీర వేడి పెరుగుతుంది. మెనోపాజ్ (ముట్లు ఉడిగే దశ) సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల మహిళల ఒంట్లో వేడి, రాత్రిపూట చెమటలు పట్టవచ్చు.  కొన్ని రకాల మెడిసిన్స్ వాడటం వల్ల కూడా శరీర ఉష్ణోగ్రత పెరగవచ్చు.

శరీరాన్ని చల్లబరిచే  అద్భుతమైన ఆహారాలు ఇవే:

1. కొబ్బరి నీళ్లు
వేసవికి ఇది ప్రకృతి ఇచ్చిన వరం. ఇందులో ఉండే ఎలక్ట్రోలైట్స్ శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. ఇది ఒంటి వేడిని తగ్గించి హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. కొబ్బరి నీళ్లు తాగడమే కాకుండా, అందులోని లేత కొబ్బరిని ముఖానికి రాసుకుంటే చర్మం చల్లగా మారుతుంది.

2. మజ్జిగ
మజ్జిగలో విటమిన్లు, ఖనిజాలు ఇంకా ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. రోజుకు రెండుసార్లు మజ్జిగ తాగడం వల్ల జీర్ణక్రియ బాగుంటుంది ఇంకా ఎంతటి ఎండలోనైనా శరీరం చల్లగా ఉంటుంది.

3. కలబంద (అలోవెరా)
కలబందకి సహజంగానే చలువ చేసే గుణం ఉంటుంది. దీని జెల్‌ను చర్మానికి రాసుకోవచ్చు లేదా పుదీనా, దోసకాయతో కలిపి జ్యూస్‌లా చేసుకుని తాగవచ్చు. ఇది లోపలి నుండి వేడిని తగ్గిస్తుంది.

4. పుదీనా
పుదీనా శరీర ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేస్తుంది. దీనిని పెరుగు, మజ్జిగ లేదా నిమ్మరసంలో కలుపుకుని తీసుకుంటే చాలా మంచిది. పుదీనా చట్నీ రూపంలో కూడా తీసుకోవచ్చు.

5. పుచ్చకాయ
పుచ్చకాయలో 92% నీరు ఉంటుంది. ఇది వేసవిలో శరీరానికి అవసరమైన నీటిని అందించి డీహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది. క్రమం తప్పకుండా పుచ్చకాయ ముక్కలు తినడం వల్ల వేడి తగ్గుతుంది.

►ALSO READ | యూనియన్ బ్యాంక్‌లో 1865 అప్రెంటీస్ పోస్టులు: డిగ్రీ పాసైనోళ్లకు మంచి అవకాశం...

6. దోసకాయలు
దోసకాయలో 95% నీరు, పీచు పదార్థం (Fiber) ఎక్కువగా ఉంటుంది. ఇది వేసవిలో వచ్చే మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. కళ్లపై దోసకాయ ముక్కలు పెట్టుకుంటే కళ్ల మంటలు తగ్గి చల్లగా ఉంటుంది.

7. మిరపకాయలు
వినడానికి వింతగా ఉన్నా, మిరపకాయలు కూడా చలువ చేస్తాయి! మిరపలోని 'క్యాప్సైసిన్' మెదడుకు సంకేతాలు పంపి, శరీరం ఎక్కువగా చెమట పట్టేలా చేస్తుంది. ఆ చెమట ఆవిరైపోయినప్పుడు శరీరం చల్లబడుతుంది.

8. నిమ్మరసం
నిమ్మకాయలో విటమిన్-సి ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి ఆక్సిజన్ అందిస్తూ, తేమను కాపాడుతుంది. నీటిలో కొంచెం ఉప్పు, చక్కెర, నిమ్మరసం కలిపి తాగితే అది నాచురల్ 'ఎలక్ట్రోలైట్' లాగా పనిచేసి తక్షణ శక్తిని ఇస్తుంది.

9. ఉల్లిపాయలు
ఉల్లిపాయలో ఉండే 'క్వెర్సెటిన్' వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. అందుకే ఎండలో బయటకు వెళ్లేవారు ఉల్లిపాయ ముక్కలు తినడం మంచిది. వీటిని సలాడ్లలో లేదా రైతాలో కలుపుకోవచ్చు.

10. సెలెరీ (Celery)
సెలెరీలో 90% నీరు ఉంటుంది. ఇందులో సోడియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి వేసవిలో శరీరాన్ని తాజాగా, చల్లగా ఉంచడానికి దోహదపడతాయి.