బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు

బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు
  • తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో బాలిక ఫిర్యాదు
  • డిసెంబర్ 31న ఓ పార్టీలో.. మరో రెండు సార్లు అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌/జీడిమెట్ల/కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రైం, వెలుగు:  కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమారుడు వివాదంలో చిక్కుకున్నాడు. అతడిపై పోక్సో కేసు నమోదయింది. సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌ సమీపంలోని సుచిత్రకు చెందిన ఓ  మైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (17) ఇచ్చిన ఫిర్యాదు మేరకు బండి సంజయ్‌‌‌‌‌‌‌‌ కొడుకు సాయి భగీరథ్‌‌‌‌‌‌‌‌పై పేట్‌‌‌‌‌‌‌‌ బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాద్‌‌‌‌‌‌‌‌ పోలీసులు శనివారం  బీఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌74,75 సెక్షన్లతోపాటు సెక్షన్ 11 రెడ్‌‌‌‌‌‌‌‌ విత్‌‌‌‌‌‌‌‌ 12 పోక్సో చట్టం కింద ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్ రిజిస్టర్ చేశారు.

బాధితురాలు ఇచ్చిన స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా లైంగిక వేధింపులు, ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ పార్ట్స్‌‌‌‌‌‌‌‌ తాకడం తదితర సెక్షన్ల కింద దర్యాప్తు ప్రారంభించారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్‌‌‌‌‌‌‌‌, సుచిత్రకు చెందిన బాలిక కామన్ ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌. వీరంతా కలిసి డిసెంబర్ 31న మొయినాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఓ ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లో న్యూ ఇయర్​ సెలబ్రేషన్స్​ జరుపుకున్నారు. పార్టీ సమయంలో భగీరథ్‌‌‌‌‌‌‌‌ తనకు మద్యం తాగించాడని.. పలుమార్లు తన  ప్రైవేట్ పార్ట్స్‌‌‌‌‌‌‌‌ను తాకాడని బాలిక తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిసింది. 

కరీంనగర్ పోలీస్ స్టేషన్‌‌లో భగీరీథ్ ఫిర్యాదు.. 

తమ మధ్య ఉన్న స్నేహాన్ని ఆసరాగా తీసుకొని తనను బ్లాక్​మెయిల్​చేస్తున్న యువతి, ఆమె తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని కరీంనగర్​ పోలీసులకు  బండి సాయి భగీరథ్  ఫిర్యాదు చేశారు. తమ కూతురిని పెళ్లి చేసుకోవాలని, లేదంటే రూ.5 కోట్లు ఇవ్వాలని యువతి తండ్రి డిమాండ్ చేస్తున్నాడంటూ భగీరథ్​ చేసిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అందులోని వివరాల ప్రకారం.. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని కామన్ ఫ్రెండ్ ద్వారా భగీరథ్‌‌‌‌‌‌‌‌కు ఒక యువతి పరిచయమైంది.

వీరంతా కలిసి ఫ్యామిలీ ఫంక్షన్లకు, ఆలయాలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతుండేవారు. ఈ క్రమంలో భగీరథ్, సదరు యువతి, మిగతా స్నేహితులు కలిసి గతంలో విజయవాడ కనకదుర్గ ఆలయానికి, అరుణాచలం, తిరుమల దేవస్థానాలకు వెళ్లారు. ఆ తర్వాత కొంత కాలానికి సదరు యువతి ప్రవర్తనలో మార్పు వచ్చిందని, ఆమె తల్లిదండ్రులు తనకు ఫోన్ చేసి వారి కుమార్తెను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారని భగీరథ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

‘‘పెళ్లికి నేను నిరాకరించడంతో నాపై పలు ఆరోపణలు మోపి తప్పుడు క్రిమినల్ కేసులు పెట్టిస్తామని బెదిరించారు. లేదంటే పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలని  డిమాండ్ చేశారు. భయంతో నేను యువతి తండ్రికి రూ.50 వేలు ఇచ్చా. నన్ను ఒంటరిగా వదిలేయమని కోరా. ఆ తర్వాత వారు రూ.5 కోట్లు డిమాండ్ చేశారు.

ఇవ్వకుంటే  ఆత్మహత్య చేసుకుంటానని యువతి తల్లి బెదిరించింది. యువతి తల్లిదండ్రులు రోజూ నన్ను మానసిక వేధింపులకు గురిచేస్తున్నారు. నా స్నేహితులలో కొందరికి ఈ వ్యక్తులతో ఇలాంటి సమస్యే ఎదురైంది. వారు ఇంతకుముందు ఏప్రిల్ 21న నిర్మల్ పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో ఆ యువతిపై ఫిర్యాదు చేశారు. దీంతో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది’’ అని భగీరథ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇంటికి వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు: బాధితురాలు

గతేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా నానక్‌‌‌‌‌‌‌‌రామ్‌‌‌‌‌‌‌‌గూడలోని ఓ ప్రాంతంలో సాయి భగీరథ్​ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని పోలీసులకు బాధిత బాలిక తెలిపింది.  సుచిత్రలోని తమ ఇంటికి వచ్చి తనకు ఇష్టం లేకున్నా ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేశాడని ఫిర్యాదులో వెల్లడించినట్టు సమాచారం. వీటితోపాటు కామన్ ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌తో కలిసి చేసుకున్న పలు పార్టీల్లో అసభ్యకరంగా వ్యవహరించాడని..

అత్యాచార యత్నానికీ పాల్పడ్డాడని పేర్కొన్నట్టు తెలిసింది. కాగా,  ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు భగీరథ్‌‌‌‌‌‌‌‌పై పోక్సో చట్టం కింద  నమోదు చేశారు. బాధితురాలు వెల్లడించిన వివరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు డిసెంబర్ 31న పార్టీలో పాల్గొన్న భగీరథ్‌‌‌‌‌‌‌‌ స్నేహితుల వివరాలు సేకరిస్తున్నారు.