- రాష్ట్రవ్యాప్తంగా 1.31 లక్షల మందికి అందిస్తామని వెల్లడి
- ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్, వెలుగు: జనవరిలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునఃప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అధికారులను ఆదేశించారు. బుధవారం సెక్రటేరియెట్ లో వ్యవసాయం, అనుబంధ శాఖల అధికారులతో జరిపిన సమీక్షా సమావేశంలో మంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత ప్రభుత్వం ఆపేసిన కేంద్ర పథకాలను ఒక్కొక్కటిగా పునరుద్ధరిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
ఇప్పటికే జాతీయ ఆహార భద్రత మిషన్ కింద పప్పుదినుసుల విత్తనాలను సబ్సిడీపై అందించినట్లు గుర్తుచేశారు. ఇప్పుడు రైతు యాంత్రీకరణ పథకాన్ని పునఃప్రారంభించాలని సీఎం నిర్ణయించారని, ఈ పథకం కింద మొత్తం 1,31,000 మంది రైతులకు సబ్సిడీపై వివిధ పనిముట్లు, యంత్రాలు అందించనున్నట్లు తెలిపారు. పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మంత్రి వివరించారు.
జనవరి మొదటి వారంలో సీఎం చేతుల మీదుగా పథకాన్ని ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. జిల్లా వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు జనవరి మొదటి వారంలో మండలస్థాయిలో పర్యటించి, సబ్సిడీలు, యాంత్రీకరణ దరఖాస్తులు, యూరియా యాప్ అమలు తదితర అంశాలపై రైతుల నుంచి ఫీడ్‌బ్యాక్ సేకరించాలని మంత్రి ఆదేశించారు. రైతుల సమస్యలను నేరుగా తెలుసుకుని తక్షణమే పరిష్కరించాలన్నారు.
కేంద్ర నిధులను వృథా చేయకూడదనే ఆలోచనతో సీఎం ఉన్నారని, స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్‌ను సమయానికి విడుదల చేసేందుకు ఆదేశాలిచ్చారని మంత్రి తెలిపారు. ఇప్పటికే రూ.400 కోట్లు స్టేట్ షేర్ విడుదల చేసి వినియోగించినట్లు పేర్కొన్నారు. యాసంగి సీజన్‌లో రైతుభరోసా నిధులను త్వరగా అందించేందుకు సాటిలైట్ ఇమేజ్ మ్యాపింగ్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి తుమ్మల అధికారులకు సూచించారు.
